హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): ‘రాజాసింగ్ మా పార్టీ గౌరవ ఎమ్మెల్యే.. రాజాసింగ్‌ది మా ఇంటి విషయం. ఇంట్లోనే కూర్చొని మాట్లాడుకుంటాం’ అంటూ ఇటీవల మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో ఈ ఇద్దరు నేతలు కూర్చొని మాట్లాడుకుంటారని, వివాదం సద్దుమణుగుతుందని బీజేపీ శ్రేణులు భావించాయి. అలా జరగకపోగా వివాదం మరింత ముదురుతున్నది. ఇటీవల హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణ సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సహకరిస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందంటూ చేసిన వ్యాఖ్యలపై రాజాసింగ్ సెటైర్లు వేశారు. సీఎం రేవంత్‌రెడ్డి అడుగుతున్న వారికి చెవులు ఉన్నా.. వినపడవని, నోరు ఉన్నా మాట్లాడరని ఎద్దేవా చేశారు. అలాంటి మహానుభావులను అడిగితే ఏం సహాయం చేస్తారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కమలం పార్టీలో దుమారం రేపుతున్నాయి. ఏ విషయమైనా అంతర్గతంగానే చర్చించాలని పదేపదే రాష్ట్ర అగ్ర నాయకత్వం చెప్తున్నా.. రాజాసింగ్ డోంట్‌కేర్ అంటూ తన దారిలో తాను ముందుకెళ్తున్నారు.ఆయన దూకుడే ఇప్పుడు బీజేపీకి ఇబ్బందికరంగా మారుతోంది.
పార్టీలో కుల రాజకీయాలు..
తాజాగా రాజాసింగ్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆరు నెలల్లో ఉపఎన్నిక ఉంటుందని, ఈ ఎన్నికల్లో ఎంఐఎం తమ ఓటు బ్యాంకును కాంగ్రెస్ పార్టీకి అమ్ముతుందా? అని ప్రశ్నించారు. ఇక తమ పార్టీ విషయానికొస్తే గతంలో ఈ సెగ్మెంట్లో కుల రాజకీయం నడిచిందని.. ఇప్పుడు కూడా కుల రాజకీయమే నడుస్తుందా? లేక సీనియర్లకు అవకాశం ఇస్తారా? అని రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశ్నించారు. ఒకవైపు కిషన్‌రెడ్డి కూర్చొని మాట్లాడుకుంటాం.. ఇది ఇంటి విషయం అని అంటుండగా.. రాజాసింగ్ మాత్రం ఇది ఇంటి సమస్య కాదని, రచ్చబండ వద్దే తేల్చుకుందామనేలా వ్యవహరిస్తున్నారు. సొంత పార్టీని ఇరుకున పెట్టేలా వరుసగా వ్యాఖ్యలు చేస్తుండటం, కిషన్‌రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుండటంతో ఇటీవల రాజాసింగ్‌కు నోటీసులు ఇస్తారనే చర్చ జరిగింది. అయినా రాజాసింగ్ తగ్గకపోవడంతో రానున్న రోజుల్లో ఆయనపై చర్యలు తప్పవని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.