ఘట్కేసర్, ఆగస్టు 13ః ద్విచక్ర వాహనాన్ని గూడ్స్ వ్యాన్ ఢీ కొట్టడంతో ఆర్టీసీ కండక్టర్ మృతి చెందిన సంఘటన ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధి ఎన్‌ఎఫ్‌సీనగర్‌లో మంగళవారం రాత్రి జరిగింది. ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ ఎం బాలస్వామి తెలిపిన వివరాల ప్రకారం ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధి ఎదులాబాద్ రోడ్డు ఎన్‌ఎఫ్‌సీనగర్ చౌరస్తాలో ఘట్కేసర్ నుండి ఎన్‌ఎఫ్‌సీనగర్‌కు ద్విచక్రవాహనంపై వెళుతున్న ఆర్టీసీ కండక్టర్ మాలోతు శివకుమార్(39)ను ఎదులాబాద్ నుండి ఘట్కేసర్ వైపు వెళుతున్న టాటా గూడ్స్ వ్యాన్ ఢీ కొట్టింది.
దీంతో శివకుమార్ ముఖం, ఛాతి, ఇతర అవయవాలకు తీవ్ర గాయాలై రక్తస్రావం జరిగింది. స్థానికులు వెంటనే ఆయనను ఘట్కేసర్ ప్రభుత్వ దవాఖానకు తరలించగా పరిస్థితి విషమంగా ఉందని నగరంలోని గాంధీ దవాఖానకు తీసుకువెళ్లాలని సూచించారు. కాగా నారపల్లిలోని ఓ ప్రైవేటు హస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు ఆర్టీసీ చెంగిచెర్ల డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడని, విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.