సిటీబ్యూరో, జూలై 1 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరంలో మెట్రో రైలు సేవలను అందిస్తున్న ఎల్ అండ్ టీ మెట్రో రైలు(L&T Metro) సంస్థకు గోల్డెన్ పీకాక్ అవార్డు(Golden Peacock Award) లభించింది. బెంగళూరులో ఇటీవల నిర్వహించిన ప్రతిష్టాత్మక ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ 25వ ఇంటర్నేషనల్ కాన్పరెన్స ఆన్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ కార్యక్రమంలో పురస్కారాల ప్రధానం జరిగింది. ఈ సందర్బంగా ఎల్ అండ్ టీ మెట్రో ఎం.డీ, సీఈఓ కేవీబీ రెడ్డి మాట్లాడారు.
అత్యుత్తమ భద్రత ప్రమాణాలు, పని ప్రదేశంలో ఆరోగ్యకరమైన పరిస్థితులను పాటించడానికి ప్రాధాన్యత ఇవ్వడంలో తమ బృందం చేసిన నిరంతరం కృషికి గుర్తింపుగా గోల్డెన్ పీకాక్ అవార్డు వచ్చిందని తెలిపారు. మొత్తం 778 దరఖాస్తులు రాగా అందులో ఎల్ అండ్ టీ మెట్రోకు అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. మునుముందు అత్యుత్తమ భద్రతా ప్రమాణాలను కొనసాగించడంలో తమ ఉద్యోగులు నిరంతరం చేస్తారని కేవీబీఆర్ పేర్కొన్నారు.