Chain Snatching | మన్సూరాబాద్, సెప్టెంబర్ 23: వంటింట్లో చొరబడి ఓ వృద్ధురాలి మెడలోని చైన్‌ను ఓ మహిళ స్నాచింగ్ చేసింది. సీఐ మక్బూల్ జానీ తెలిపిన ప్రకారం.. నాగోల్, ఆనంద్‌నగర్, కృషినగర్‌లో ధనలక్ష్మి వృద్ధురాలు ఒంటరిగా నివాసముంటుంది. మంగళవారం ఉదయం ధనలక్ష్మి ఇంట్లో వంట చేసుకుంటుండగా గుర్తు తెలియని మహిళ వచ్చి వృద్ధురాలు నోటికి ప్లాస్టర్ వేసి మెడలోని తులం బంగారు గొలుసును లాక్కెల్లింది. స్థానికులు నాగోల్ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకొని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. దొంగతనం చేసిన మహిళ ఫతుల్లాగూడ సర్వే నెం.58 వైపు వెళ్లినట్లు గుర్తించారు. కూరగాయలు అమ్ముకునే స్రవంతిగా గుర్తించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అప్పుల బాధతో ఈ చోరీకి పాల్పడిందని విచారణలో తేలింది. నిందితురాలు స్రవంతిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితురాలి నుంచి తులం బంగారు గొలుసును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్ పోలీసుల సహకారంతో నాగోల్ పోలీసులు చైన్‌స్నాచింగ్ కేసును ఛేదించారు. 3 గంటల్లోనే కేసును ఛేదించి బాధితురాలికి బంగారు గొలుసును అప్పగించడం పట్ల స్థానికులతోపాటు వృద్ధురాలు హర్షం వ్యక్తం చేశారు.