వెతికి భాధితులకు అప్పగించిన మున్సిపల్ అధికారులు
Ganesh Immersion | తుర్కయంజాల్,ఆగస్టు 30: భక్తిలో భగవంతుడితో పాటుగా సుమారు రూ. 5 లక్షలు విలువ చేసే బంగారు గొలుసును నిమజ్జనం చేసిన ఘటన తుర్కయంజాల్ మున్సిపాలిటి పరిధి మాసబ్ చెరువు వద్ద చోటు చేసుకుంది. నిమజ్జనం అనంతరం తాము చేసిన పొరపాటును గుర్తించిన వ్యక్తులు వెంటనే నిమజ్జనం పాయింట్ వద్ద ఉన్న అధికారులకు సమాచారం అందించారు. నగరంలోని హస్తినపురానికి చెందిన గిరిజ కుటుంబ సభ్యులు శనివారం ఉదయం వినాయకుడిని నిమజ్జనం చేయడానికి తుర్కయంజాల్లోని మాసబ్ చెరువు వద్దకు వచ్చారు. పొరపాటున వినాయకుడిని సుమారు రూ. 5 లక్షలు విలువ చేసే బంగారు గొలుసుతో పాటుగా నిమజ్జనం చేశారు.
అయితే వినాయకుడిని నిమజ్జనం చేసిన అనంతరం వినాయక విగ్రహనికి వేసిన బంగారు గోలుసు గుర్తుకు వచ్చింది. దీంతో వెంటనే మాసబ్ చెరువు నిమజ్జన పాయింట్ వద్ద ఉన్న అధికారులకు తెలియజేశారు. దీంతో అధికారులు జేసీబీ సహయంతో నిమజ్జనం చేసిన విగ్రహలను బయటకు తీసి వినాయకుడి మెడలో ఉన్న 5 తులాల బంగారు గొలుసును గిరిజన కుటుంబ సభ్యులకు అందజేశారు. వెంటనే స్పందించి అధికారులు గొలుసును వెతికించి ఇవ్వడం పట్ల గిరిజ కుటుంబ సభ్యులు అధికారులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ.. నిమజ్జన సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోని విగ్రహలను నిమజ్జనం చేయాలని సూచించారు.