హయత్‌నగర్, అక్టోబర్ 13 : సదాశివ ఎన్క్లేవ్ గేటెడ్ కమ్యూనిటీలోని రెండు ఇళ్లల్లో ఆదివారం రాత్రి దుండగులు చోరీకి తెగపడ్డారు. ఈ ఘటనలో 30 గ్రాముల బంగారం, 4 కిలోల వెండి ఆభరణాలుతో పాటు కొంత నగదును దొంగలు ఎత్తుకెళ్లిన ఘటన హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. సోమవారం హయత్‌నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సంతోష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రిటైర్డ్ లెక్చరర్ గూడురు రాజేందర్ అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ కేంద్రంలోని సదాశివ ఎన్క్లేవ్, గేటెడ్ కమ్యూనిటీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. కాగా అనారోగ్యం కారణంగా నాలుగు నెలలుగా హన్మకొండలో చికిత్స పొందుతున్నాడు.
రోజుమాదిరిగానే రాజేందర్ ఇంటిని శుభ్రం చేసే పని మనిషి సోమవారం ఉదయం ఇంటికి వెళ్లి చూడగా బీరువాలోని వస్తువులు చిందరవందరగా పడి ఉండటాన్ని గమనించి వెంటనే ఇంటి యజమానికి, పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అదేవిధంగా రాజేందర్ ఇంటికి సమీపంలో నివాసం ఉంటున్న బీవీకే రెడ్డి నెల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి ఆమెరికా వెళ్లారు. ఇది గమనించిన దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి లాకర్లోని రెండున్నర కిలోల వెండి, 30 గ్రాముల బంగారం ఎత్తుకెళ్లారు. ఫిర్యాదు అందుకున్న క్లూస్‌టీమ్, వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి, హయత్‌నగర్ డీఐ సంతోష్‌కుమార్, సీఐ నాగరాజుగౌడ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.