మణికొండ, ఏప్రిల్ 28: నార్సింగి సర్కిల్ పరిధిలోని కోకాపేట సోమవారం రాత్రి బాస్లింగ్ ఘటనతో ఉలిక్కిపడింది. కోకాపేట ప్రీమియర్ ఆసుపత్రి వెనకాల గోద్రెజ్ నిర్మాణ రంగ సంస్థకు సంబంధించిన ఓ భారీ వెంచర్ నిర్మాణ పనుల్లో భాగంగా గత నాలుగు నెలలుగా చేపట్టిన సెల్లార్ తవ్వకాల కోసం కొన్నిరోజులుగా అక్రమ బ్లాస్టింగులు చేపడుతున్నది. జనావాసాల మధ్యలో బ్లాస్టింగులు చేపట్టవద్దంటూ అనేక పర్యాయాలు ప్రజలు.. పోలీసులు, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు చేశారు. అయినా అవేమీ పట్టించుకోకుండా గోద్రెజ్ నిర్మాణ రంగ సంస్థ ‘కామ్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థ నిర్వాహకులకు బ్లాస్టింగులు చేపట్టేందుకు అనుమతులు ఇచ్చింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుంచి తాత్కాలిక అనుమతి పత్రాలను చూపి సదరు వ్యక్తులు రాత్రి, పగలు అన్న తేడా లేకుండా బ్లాస్టింగులకు పాల్పడుతున్నారు. కామ్స్ సంస్థ ప్రతినిధి ఖాజా మొయినుద్దీన్ అనే వ్యక్తి పర్యవేక్షణలో కొనసాగుతున్న ఈ బ్లాస్టింగులు సోమవారం రాత్రి ఏకంగా పదిచోట్ల బ్లాస్టింగులు చేపట్టారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా మబ్బులు కమ్ముకుని చెవులన్నీ దిబ్బరపోయాయి. తేరుకుని చూసేలోపే పెద్దపెద్ద బండరాళ్లు గాల్లో ఎగిరిపడుతూ పక్కనే ఉన్న ఇళ్ల పై వచ్చిపడ్డాయి. ఈ శబ్దాలకు ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. కొంతమంది భూకంపం వచ్చిందేమోనంటూ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని భవనాల నుంచి కిందకు దిగుతుండటం కనిపించింది.
గోద్రెజ్ నిర్మాణ సంస్థ జరిపిన ఈ బ్లాస్టింగుల ధ్వని-ప్రకంపనలతో చుట్టుపక్కల ఉన్న రెండు, మూడు అంతస్తుల ఇళ్ల పునాదులు కదిలిపోయాయి. గోడలు, బాల్కానీలు, సజ్జాలు పూర్తిగా కుంగిపోయాయి. కొన్ని ఇళ్లలో సామగ్రి కిందపడి ఒక్కసారిగా భూకంపం సంభవించినట్లుగా మారింది. బ్లాస్టింగుల కారణంగా కోకాపేటలోని పలు ఇళ్ల్లల్లోని బోర్వెల్స్ పూర్తిగా కుచించుకుపోయని ప్రజలు తెలిపారు. బ్లాస్టింగుల కారణంగా మా ఇళ్లల్లోని నాలుగు బోర్లు ఇప్పటికే కుచించుకుపోయాయని వీటిపై పరిహారం ఇవ్వాలని కోరితే అవి తప్పిదం వల్ల కాలేదని ఎవరి చెబుతారో చెప్పుకోండి అంటూ నిర్వాహకులు అంటున్నారని ఓ ఇంటి యజమాని తెలిపారు. అయితే ఈ విషయాన్ని బయటకు పొక్కనీయకుండా కొంతమంది స్థానిక నాయకులు, పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా బాధితులతో బేరాలు చేసి, పరిహారాలను ఇప్పించేలా చర్యలు తీసుకుంటామంటూ సర్థిచెప్పినట్లు తెలిసింది.
చావుతప్పి కన్నులొట్టపోయినట్లుగా పదిచోట్ల ఏకకాలంగా బ్లాస్టింగులు జరిగిన ఈ సంఘటపై నార్సింగి పోలీసులు ఓ చిన్నపాటి కేసు నమోదు చేసి నిర్వాహకులపై చర్యలు తీసుకున్నామంటూ చేతులు దులిపేసుకున్నారు. ఈ ప్రమాదంలో పాక్షికంగా, పూర్తిగా ధ్వంసమైన ఇళ్ల భాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించినట్లు తేల్చేశారు. ఇదే పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోతే కూడా ఇదేవిధంగా వ్యవహరిస్తారా అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.