Hyderabad | సిటీబ్యూరో: కొన్ని వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే వరుస ఘటనలు నగర ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఒక ఘటన జరిగితే మళ్లీ అలాంటివి పునరావృతం కాకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సి ఉన్నా.. ఆ దిశగా అడుగులు ఉండటం లేదన్న విమర్శలున్నాయి. సోమవారం సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలోకి దుండగుడు చొరబడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన కలకలం సృష్టించింది.
హైదరాబాద్‌లో వర్గాల మధ్య చిన్న పాటి గొడవ జరగకుండా బీఆర్ఎస్ పదేండ్ల పాలన సాగింది. అదే స్ఫూర్తితో పనిచేయాల్సిన పోలీసులు.. ప్రభుత్వం మారగానే అప్పుడు చేసిన సంస్కరణలు మేమెందుకు పాటించాలనే ధోరణితో హైదరాబాద్ పోలీసింగ్‌ను మార్చేశారన్న విమర్శలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే నగరంలో కలహాలకు దారితీసే వరుస ఘటనలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.
రెండు నెలల కిందట సంతోష్‌నగర్‌లో అమ్మవారి ఆలయం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు విధ్వంసానికి పాల్పడ్డారు. అలాగే ఇటీవల ఎగ్జిబిషన్ గ్రౌండ్లో దసరా నవరాత్రుల సందర్భంగా ఒక మండపం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు విధ్వంసకర చర్యలకు పాల్పడ్డారు. అయితే ఈ ఘటనపై అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని గుర్తించారు. సదరు నిందితుడి మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని పోలీసులు తేల్చారు. మరుసటి రోజు మాసబ్ ట్యాంక్ ప్రాంతంలో అలజడి సృష్టించే ఘటన జరిగింది.
సీసీ కెమెరాల ఆధారంగా వెంటనే అసలు విషయాన్ని బయటపెట్టారు. మండపం వద్ద ఒక మాంసం ముక్క పడడానికి కుక్క కారణమనే విషయాన్ని వెల్లడించారు. అయితే ప్రశాంతంగా ఉండే సికింద్రాబాద్ ప్రాంతంలో ఎవరూ ఉహించనట్లుగా సోమవారం ఘటన చోటుచేసుకుంది. ముంబై నుంచి వచ్చిన వ్యక్తి ఇక్కడ ఆలయంలో విధ్వంసకర చర్యలకు పాల్పడటమే అనుమానాస్పదంగా ఉంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు హైదరాబాద్‌లో విధ్వంసకర చర్యలకు పాల్పడుతున్నారంటే పోలీసులు ఏం చేస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
పోలీసుల పహారా ఉందనే భయం నేరస్తులకు లేకుండా పోయింది. అసలు విజుబుల్ పోలీసింగ్‌ను మొత్తానికే పక్కనే పెట్టేశారనే ఆరోపణలు వస్తున్నాయి. సీసీ కెమెరాలు కూడా చాలా చోట్ల పనిచేయడం లేదు. పెట్రోలింగ్ వ్యవస్థను గాలికొదిలేశారు. క్షేత్ర స్థాయిలో ఎవరేం చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకునే వ్యవస్థను పక్కన పెట్టేయడంతో సిబ్బందిలో జవాబుదారీతనం కొరవడిందనే విమర్శలొస్తున్నాయి.