చిక్కడపల్లి, డిసెంబర్ 14: అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి జీవో 317ను సవరించి ఉద్యోగ, ఉపాధ్యాయులను తమ స్థానిక జిల్లాలు, జోన్లకు కేటాయించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో 317 జీవో వలన స్థానికత కోల్పోయిన ఉద్యోగ, ఉపాధ్యాయ స్థానికత సాధనకు శనివారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మహా నిరాహార దీక్ష చేపట్టారు.
చైర్మన్ విజయ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు, కన్వీనర్ మధుసూన్ రెడ్డి మాట్లాడుతూ ఈ జీవో పై ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. స్థానిక అంశమే లేకుండా మూడు జీవోలు రావడం పై స్థానికత కోల్పోయిన ఉద్యోగ, ఉపాధ్యాయలను తీవ్ర నిరాశకు గురయ్యారని తెలిపారు. జీవోను వెంటనే సవరించి న్యాయం చేయాలని కోరారు. నాయకులు సందీప్, మల్లేశ్, రమేశ్, రేష్మ, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.