Golkonda Bonalu | మెహిదీపట్నం, జూలై 7: నగరంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. ఆదివారం గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక మహంకాళి ఎల్లమ్మకు తొలి బోనం సమర్పించారు. దీంతో భాగ్యనగరంలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలుత లంగర్‌హౌస్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన వేదికపై నుంచి స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు చెన్నారెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, రాజ్యసభ మాజీ సభ్యుడు హన్మంతరావు, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి, పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, గోల్కొండ బోనాల ఉత్సవ కమిటీ చైర్మన్ కాంత అరవింద్ మహేశ్‌కుమార్‌తో కలిసి బోనాలను ప్రారంభించారు.
ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్ర్తాలను సమర్పించారు. అనంతరం తొట్టెలకు కల్లు సాక పోసి.. స్పీకర్ గడ్డం ప్రసాద్, ఎమ్మెల్యే దానం నాగేందర్ పోతరాజులతో కలిసి నృత్యాలు చేశారు. అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. గోల్కొండ బంజారా దర్వాజ నుంచి కులవృత్తుల సంఘం అధ్యక్షుడు సాయిబాబాచారి, నాయకులు రాజువస్తాద్, నాగాబాయి, శ్రీకాంత్‌చారి ఆధ్వర్యంలో నజర్ బోనంను ఎల్లమ్మకు సమర్పించారు. అలాగే, తెలంగాణ కుమ్మరుల సంఘం ఆధ్వర్యంలో 501 బోనాలను సమర్పించారు. కుమ్మరుల సంబురాల్లో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, రాకేశ్‌రెడ్డి పాల్గొన్నారు. పోతరాజుల నృత్యాలు, కళాకారుల ఆటపాటలతో లంగర్‌హౌస్ చౌరస్తా నుంచి తొట్టెల ఊరేగింపు సాగింది. కాగా, గవర్నర్ రాధాకృష్ణన్ గోల్కొండ కోటలో బోనాల పూజలు నిర్వహించారు.
ఆషాఢ మాసం బోనాలను ప్రజలు ఉత్సాహంతో జరుపుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ఆకాంక్షించారు. గోల్కొండ బోనాలను లంగర్‌హౌస్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ప్రారంభించిన అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ఆషాఢ బోనాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించాలని నిర్ణయించారన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రజలందరూ గోల్కొండ బోనాలను ఉత్సాహంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఆషాఢ మాసం బోనాలను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సకల ఏర్పాట్లు చేసినట్లు మంత్రి కొండా సురేఖ చెప్పారు.
సిటీబ్యూరో: బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానంలో సోమ, మంగళ, బుధవారాల్లో ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం, రథోత్సవాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో మూడు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్ తెలిపారు.
బేగంపేట, జూలై 7: ప్రతిష్టాత్మక సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి దేవాలయం వద్ద ఆషాఢ బోనాల జాతర సందడి ప్రారంభమైంది. ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఘటోత్సవాల్లో భాగంగా ఆదివారం మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ అమ్మవారి ఘటత్సోవ అలంకరణను ప్రారంభించారు.