సిటీబ్యూరో, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : వందేళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు ఓయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ డి. రవీందర్‌యాదవ్ తెలిపారు. ఇందులో భాగంగా జనవరి 3, 4వ తేదీల్లో గ్లోబల్ అలుమ్ని మీట్ (పూర్వ విద్యార్థుల సమ్మేళనం) నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఈ సందర్భంగా గురువారం ఓయూలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… అమెరికా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా వంటి పలు దేశాల్లో మంచి హోదాలో ఓయూ పూర్వ విద్యార్థులు 8 వేల మంది ఉన్నారని తెలిపారు.
వారందరిని ఏక తాటిపైకి తీసుకొవచ్చి వారి సహాయ సహకారాలు పొందడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని వివరించారు. పూర్వ విద్యార్థుల సహాయం పొందడానికి ఓయూ ఫౌండేషన్ అనే ఒక నూతన విభాగాన్ని ఏర్పాటు చేశామని, దీని కింద విరాళాలు ఇచ్చే దాతలకు సెక్షన్ 80 కింద ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా గ్లోబల్ అలుమ్ని మీట్‌కు సంబంధించి రెండు రోజుల కార్యక్రమాల పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ మీట్ నిర్వహణ కోసం 300 మందిని వలంటీర్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఓయూ ఫౌండేషన్ డైరెక్టర్ రాజశేఖర్, ప్రొఫెసర్ శ్రీనివాసులు, ప్రొఫెసర్ ప్యాట్రిక్, డాక్టర్ నజియా తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఓయూ నూతన సంవత్సర క్యాలెండర్‌ను వీసీ ఆవిష్కరించారు.