సిటీ బ్యూరో, మే 25 (నమస్తే తెలంగాణ) : భవన నిర్మాణ వ్యర్థాలకు సరికొత్త అర్థం చెబుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన సీ అండ్ డీ ( కన్స్ట్రక్షన్స్ అండ్ డీమాలిషన్) ప్లాంట్ల నిర్వహణలో అద్భుత ఫలితాలను రాబడుతున్నది. గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి అపరిశుభ్రతకు నిలయాలు ఉన్న భవన నిర్మాణ వ్యర్థాలను ఒక చోటకు చేర్చి రీ సైక్లింగ్ చేసి రీయూజ్ (పునర్ వినియోగం) చేస్తూ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. భవన నిర్మాణాల వ్యర్థాలను రీ సైక్లింగ్ చేసి పునర్ వినియోగంలోకి తీసుకువచ్చేందుకు నగరం నలువైపులా నాలుగు చోట్ల జీడిమెట్ల, ఫతుల్లాగూడ, శంషాబాద్, తూంకుంటలో ఒక్కొ కేంద్రంలో 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యంలో రీ సైక్లింగ్ ప్లాంట్లు నెలకొల్పారు.
ఆధునిక టెక్నాలజీతో..
జీహెచ్ఎంసీ సారథ్యంలో ‘రీ సైస్టెనబులిటీ సంస్థ (రాంకీ)ఆధునిక వెబ్ టెక్నాలజీతో తొలుత జీడిమెట్ల కేంద్రం 2020 నవంబర్లో, ఫతుల్లాగూడ కేంద్రం 2021 జూన్లో అందుబాటులోకి వచ్చాయి. రెండేండ్ల కిందట శంషాబాద్, తూంకుంటలో ప్లాంట్లు అందుబాటులోకి రాగా…మొత్తంగా నాలుగు ప్లాంట్ల నుంచి ఇప్పటి వరకు 29.67 లక్షల మెట్రిక్ టన్నుల భవన వ్యర్థాలను తరలించారు. ఇందులో 8.28లక్షల మెట్రిక్ టన్నులను రీ యూజ్లోకి తీసుకువచ్చారు. నాణ్యతకు ఢోకా లేని బంక మట్టి, దొడ్డు కంకర, సన్న కంకర, దొడ్డు ఇసుక, సన్న ఇసుక , లోహాలు, ఇతరత్రా ముడి వస్తువులుగా మార్చారు. వాటిలో సిమెంట్, సిమెంట్ ఇటుకలు, టైల్స్, పేవర్ బ్లాక్స్, ప్రీకాస్ట్ కాంక్రీటు గోడలు, సిమెంట్ దిమ్మెలు ఇతరత్రా పరికరాలు తయారు చేయడం గమనార్హం.
టోల్ ఫ్రీ నంబర్ 1800 120 1159
భవన నిర్మాణ వ్యర్థాలు ఎక్కడపడితే అక్కడ పడేయడానికి వీల్లేదు.. నిర్మాణాలు చేపట్టే సమయంలో కానీ, ఇంటి మరమ్మత్తులు, ఆధునీకరణ చేసే సమయంలో వచ్చే వ్యర్థాలను జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సీ అండ్ డీ (కన్స్ట్రక్షన్స్ అండ్ డీమాలిషన్) ప్లాంట్లకు అప్పగించకుండా కొందరు ఖాళీ స్థలాలు, చెరువులు, నాలాల పక్కన పడేస్తున్నారు. ఇందులో భాగంగా 30 సర్కిళ్లలో ఏసీపీలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.
భవన నిర్మాణ వ్యర్థాలను నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిని గుర్తించి వారికి రూ. 1000 జరిమానా విధిస్తున్నారు. ఈ మేరకు 30 సర్కిళ్ల నుంచి గడిచిన మూడు నెలల కాలంలో రూ. 60 లక్షల మేర జరిమానాలు విధించినట్లు అధికారులు పేర్కొన్నారు. నగరం నలువైపులా భవన నిర్మాణాల వ్యర్థాలను రీ సైక్లింగ్ చేసి రీయూజ్ (పునర్ వినియోగం)లోకి తీసుకువచ్చేందుకు నాలుగు ప్లాంట్లను ఏర్పాటు చేయడం చేశామని, టోల్ ఫ్రీ నంబర్ 1800 120 1159లో, వాట్సప్ నంబరు 9100927073లో చెబితే సంబంధిత ఏజెన్సీ వారు వచ్చి వారీ వారీ ప్లాంట్లకు తీసుకువెళ్తారని కమిషనర్ ఈ సందర్భంగా ప్రజలకు వివరించారు.