సిటీబ్యూరో, మే 12(నమస్తే తెలంగాణ): రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ హత్య కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గంలో ప్రముఖులు, ధనవంతుల ఇండ్లల్లో పని చేస్తున్న నేపాలీల వివరాలు సేకరించే పనిలో పడ్డారు.
ఇండ్ల యజమానులకు నోటీసులు జారీ చేస్తూ పనిమనుషుల వివరాలను స్థానిక పోలీస్స్టేషన్లో అందజేయాలని యజమానులను కోరుతున్నారు. నేపాలీ పనిమనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. వారి కదలికలపై తరుచూ నిఘా పెట్టాలని.. పనిమనుషులను విధుల్లోకి తీసుకునేముందుకు వారి వ్యక్తిగత వివరాలను తప్పక సేకరించాలని కోరుతున్నారు.