సిటీబ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ): మియాపూర్‌లో ప్రభుత్వ భూముల కబ్జా ప్రయత్నాలతో హెచ్ఎండీఏ మేల్కొం ది. గ్రేటర్‌తో పాటు నగర శివారు ప్రాంతాల్లో ఉన్న భూములను రక్షించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనుంది. జియో గ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ (జీఐఎస్) పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా హెచ్ఎండీఏకు చెందిన భూము ల సరిహద్దుల కో ఆర్డినేట్స్‌ను గూగుల్ మ్యాప్‌లో కచ్చితంగా గుర్తించేలా చర్యలు చేపట్టారు. మియాపూర్‌లో సర్వే నం.100, 101లో 445 ఎకరాలు ఉండగా, మిగతా ప్రాంతాల్లో సుమా రు 7500 ఎకరాల భూమి ఉంది. వీటికి గూగుల్ మ్యాప్‌లో వాటి సరిహద్దులను జియో మ్యాపింగ్ ద్వారా గుర్తించడంతో వాటి సరిహద్దులను చేరిపేసేందుకు వీలుండదని, కబ్జా చేయడానికి అవకాశం ఉండదని హెచ్ఎండీఏ ఎస్టేట్ విభాగం అధికారులు తెలిపారు. గూగుల్ మ్యాప్‌లో అక్షాంశాలు, రేఖాంశాలను గుర్తించమే కాకుండా భౌతికంగా భూముల చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. అందులో భాగంగానే మియాపూర్‌లో క్షేత్ర స్థాయిలో ఫెన్సింగ్ పనులు మొదలు పెట్టారు. జియో ఫెన్సింగ్ బాధ్యతలను కన్సల్టెన్సీలకు అప్పగించామని తెలిపారు.
హెచ్ఎండీఏకు అప్పగించిన భూములకు జీఐఎస్ మ్యాపింగ్ చేసిన తర్వాత ఆ సమాచారాన్ని పబ్లిక్ డొమైన్లో ఉంచుతామని అధికారులు తెలిపారు. దీనివల్ల హెచ్ఎండీఏ భూములు ఎక్కడెక్కడ ఎంత విస్తీర్ణంతో, సరిహద్దులతో ఉన్నాయో ఆన్లైన్లోనే గుర్తించే అవకాశం ఉంటుంది. దీంతో పాటు భవిష్యత్తులో ఆయా భూములు కబ్జాల బారిన పడకుండా ఉంటుంది.