సిటీబ్యూరో, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : ఇంటర్మీడియట్ ఫలితాల్లో గ్రేటర్ బాలికలు సత్తా చాటారు. రాష్ట్రంలోనే ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాల్లో మేడ్చల్మల్కాజిగిరి ప్రథమ స్థానంలో నిలువగా, రంగారెడ్డి జిల్లా ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. ద్వితీయ సంవత్సరంలో మేడ్చల్మల్కాజిగిరి జిల్లాలు వరుసగా మూడో స్థానం, రంగారెడ్డి జిల్లా నాల్గో స్థానంలో నిలిచింది.
ఈ సారి ఫలితాల్లో మరోమారు హైదరాబాద్ జిల్లా వెనుకబడింది. గ్రేటర్ హైదరాబాద్కు 73 శాతం ఉత్తీర్ణత లభించింది. గతేడాది కంటే మూడు శాతం ఉత్తీర్ణత పెరిగింది. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలో కలిపి ఇంటర్ ప్రథమ సంవత్సరం జనరల్, వృత్తి విద్యా కోర్సులో కలిపి 73.41 శాతం, ద్వితీయ సంవత్సరంలో 73.39 శాతం ఉత్తీర్ణత లభించింది.
జిల్లాల వారీగా పరిశీలిస్తే ప్రథమ సంవత్సరంలో హైదరాబాద్ లో 66.68 శాతం, రంగారెడ్డి జిల్లాలో 76.36 శాతం, మేడ్చల్-మల్కాజిగిరి 77 .21 శాతం, ద్వితీయ సంవత్సరంలో మేడ్చల్ జిల్లా 77.91 శాతం, రంగారెడ్డి జిల్లా 77.53 శాతం, హైదరాబాద్ 67.74 శాతం ఉత్తీర్ణత సాధించాయి.