రంగారెడ్డి జిల్లా కోర్టులు, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ): ప్రేమ, పెండ్లి పేరుతో బాలికను కిడ్నాప్ చేసి, లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు కనకాల రాజేశ్ (26)కు జీవితఖైదు, పదివేల జరిమానా విధిస్తూ, బాధిత బాలిక కుటుంబానికి రూ. పది లక్షల పరిహారం అందజేయాలని రంగారెడ్డి జిల్లా పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి ఎం.కె.పద్మావతి తీర్పునిచ్చారు. ప్రత్యేక పీపీ సునీత కథనం ప్రకారం.. ఎల్బీనగర్ పరిధిలోని గుంటి జంగయ్య కాలనీకి చెందిన బాలిక కుటుంబం మిర్చీ బండి నడిపిస్తూ జీవిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన నిందితుడు రాజేశ్ మన్సూరాబాద్‌లో ఉంటూ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ బాలికతో పరిచయం పెంచుకున్నాడు.
ఈ పరిచయాన్ని ఆసరాగా చేసుకున్న నిందితుడు.. ప్రేమ పేరుతో బాలికను లోబర్చుకున్నాడు. పెండ్లి చేసుకుంటానని నమ్మించి 2018, మే 7న బాలికను విశాఖపట్నం, అన్నవరం తీసుకువెళ్లి బలవంతంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మూడు రోజుల తరువాత బాలికను హైదరాబాద్‌కు తీసుకువచ్చి పారిపోయాడు. జరిగిన ఘటనపై బాలిక తండ్రి ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు రాజేశ్‌ను అరెస్ట్ చేసి, రిమాండ్ తరలించారు. అనంతరం కేసు దర్యాప్తు పూర్తిచేసి.. కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడికి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.