Amrapali | సిటీబ్యూరో, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్లో ఇంటింటి చెత్త సేకరణ, జీవీపీ పాయింట్లు (తరచూ చెత్త వేసే ప్రాంతాల) ఎత్తివేతలో అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారులపై కమిషనర్ ఆమ్రపాలి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కఠిన చర్యలకు కమిషనర్ ఉపక్రమించారు. కార్మికుల అటెండెన్స్ పారదర్శకంగా ఉండేందుకు ఇటీవల ఫేషియల్ రికగ్నైషన్ తీసుకొచ్చినా.. 100 శాతం అటెండెన్స్ లేకపోవడం, ఇంటింటి చెత్త సేకరణ సరిగా జరపకపోవడం, జీవీపీ పాయింట్ల ఎత్తివేతలో నిర్లక్ష్యం..అన్నింటికంటే పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు ఉందని పేర్కొంటూ.. 10 మంది డిప్యూటీ కమిషనర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
24 గంటల్లో వివరాలు ఇవ్వాలని సదరు ఉత్తర్వులో కమిషనర్ పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న వారిలో చార్మినార్, రాజేంద్రనగర్, మెహిదీపట్నం, కార్వాన్, ముషీరాబాద్, బేగంపేట, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా తదితర సర్కిల్ డిప్యూటీ కమిషనర్లు ఉన్నారు. అయితే డీసీలతో పాటు క్షేత్రస్థాయిలో మెరుగైన పారిశుధ్య నిర్వహణలో అత్యధికంగా డీఈ, మెడికల్ ఆఫీసర్ల బాధ్యత కూడా ఉంటుంది. అయితే వీరిని కాదని కేవలం డీసీలకే షోకాజ్ నోటీసులు జారీ చేయడంపై ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
465 కాలనీల్లో ఉచిత వైద్య శిబిరాలు
సిటీబ్యూరో, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ ): వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నివారణ కోసం జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ మేరకు నగరంలో సీజనల్ వ్యాధుల నివారణకు అవగాహన కార్యక్రమాలతో పాటు పెద్ద ఎత్తున ఉచిత హెల్త్ క్యాంప్‌లను నిర్వహిస్తున్నది.
గ్రేటర్ వ్యాప్తంగా 108 వార్డుల్లోని 465 కాలనీల్లో జిల్లా వైద్య ఆరోగ్య, జీహెచ్ఎంసీ సంయుక్తంగా వైద్యశిబిరాలను ఏర్పాటు చేశామని, గుర్తించిన హాట్ స్పాట్లలో వ్యాధి సోకిన ప్రజలకు చికిత్స అందిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. ఈ వైద్య శిబిరాలు 15 వరకు ఉంటాయని వెల్లడించారు. హాట్ స్పాట్లలో 345 మందికి డెంగీ, ఒకరికి మలేరియా వ్యాధి సోకినట్లు తెలిపారు