GHMC | ఖైరతాబాద్, ఏప్రిల్ 19: గాలి వానకు వృక్షాలు కూలి 24 గంటలు గడిచినా వాటిని తొలగించడంలో జీహెచ్ఎంసీ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. రోడ్డు పక్కన పడిఉన్న చెట్ల కొమ్మలను అలాగే వదిలేయడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ జీహెచ్ఎంసీ సిబ్బంది పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్లో శుక్రవారం సాయంత్రం గాలి వాన బీభత్సానికి రహదారులపై భారీ వృక్షాలు నేలరాలాయి. అనేక చోట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. ఫలితంగా నిన్న రాత్రి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. నెక్లెస్ రోడ్డులోని సుమారు 5 కిలోమీటర్ల పరిధిలో పదుల సంఖ్యలో పెద్ద పెద్ద చెట్లు రోడ్లపై అడ్డంగా పడిపోయాయి. నిత్యం ఇదే రహదారిలో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ ఉన్నతాధికారులు ప్రయాణిస్తుటారు. ప్రజాప్రతినిధులు సైతం ఇదే దారి గుండా వెళ్తుంటారు. అలాంటి కీలకమైన రహదారిలో రోడ్డు పక్కన చెట్లు కూలి 24 గంటలు గడిచినా వాటిని తొలగించకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.