GHMC Workers | హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎండలు మండిపోతున్నాయి. భాగ్యనగరంలో భానుడి భగభగలకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు. రోజురోజుకూ పగటి ఉష్ణోగ్రతలు పెరిగి జనం నెత్తిన నిప్పులు కురిపిస్తున్నాడు. ఒకవైపు భానుడి భగభగలు.. మరోవైపు వడగాలుల తీవ్రతతో జనాలు అల్లాడిపోతున్నారు.
ఈ నేపథ్యంలోనే రోడ్లపై పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల పనివేళ్లలో మార్పులు తీసుకువచ్చారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున కార్మికులు ప్రతి రోజూ ఉదయం 4 గంటల నుంచి 5 గంటల లోపు బయోమెట్రిక్ హాజరై మధ్యాహ్నం 12 గంటల వరకు విధులు నిర్వహించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఈ పని వేళలు వేసవి కాలం ముగిసే వరకు కొనసాగుతాయని తెలిపారు.