ఎల్బీనగర్, జనవరి 11: జీహెచ్ఎంసీ వార్డుల విభజన పక్రియ ముగిసి ఫైనల్ గెజిట్ విడుదల చేశామని అధికారులు చెబుతున్నా ఇంకా సమగ్రంగా వార్డుల సరిహదులపై ప్రజలకు మ్యాపులుగానీ, ఇంటి నంబర్లతో ఏ ప్రాంతం ఏ డివిజన్లో ఉందని తెలుపకపోవడంతో సరిహద్దు ప్రాంతాల్లోని కాలనీలు, బస్తీలు, గ్రామాల వాసులు ఇప్పటికీ అయోమయంలోనే ఉన్నారు. ‘మా ప్రాంతం ఏ డివిజన్‌లోకి వస్తుందం’టూ వారు ఆయా ప్రాంతాల్లోని నాయకులను ప్రశ్నించడం కనిపిస్తోంది. నాయకులు సైతం తమకు కూడా ఈ విషయంలో స్పష్టమైన సమాచారం లేదని, అధికారులు కూడా కరెక్ట్‌గా చెప్పడం లేదంటూ వాఖ్యానిస్తున్నారు.
ఇక అధికారుల విషయానికి వస్తే వార్డుల విభజన చేయడం మొదలుకుని సరిహద్దులను గుర్తించే వరకు అంతా ఉన్న తాధికారులు, హెడ్డాపీసులోనే జరిగిందని, తమకు కూడా స్పష్టమైన వివరాలు తెలియవంటూ పేర్కొంటున్నారు. వారిని రెండు డివిజన్ల సరిహద్దు ప్రాంతంలోని నివాసితులు సంప్రదిస్తే వారికి జీహెచ్ఎంసీ వారు పంపించిన మ్యాప్‌లను మాత్రమే చూపిస్తూ తెలియజేస్తున్నారు. వార్డు ప్రక్రియను ముగించి వారాలు గడుస్తున్నా వాటిపై స్పష్టతను ఇవ్వడంలో అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని పలువురు వాపోతున్నారు.
గతంలో ఉన్న ప్రాంతాలు కాకుండా నియోజకవర్గాల పరిధులు కూడా మారడంతో పాటుగా డివిజన్లను ఒకదాని నుంచి తొలగించి మరో డివిజన్లో కలపడం వంటివి చేయడంతో ఆయా ప్రాంతాల వారు తాము ప్రస్తుతం ఏ డివిజన్లో ఉన్నామో కాస్తా తెలుపండి..అంటూ కోరుతున్నారు. కొత్తపేట డివిజన్ పెద్దదిగా ఉంది విభజన చేయండీ అంటూ.. పలువురు కోరగా దానిని అధికారులు మరోలా చూసి తూర్పు దక్షిణ ప్రాంతంలోని రాజీవ్‌గాంధీనగర్, భరత్‌నగర్, శివమ్మనగర్, శివగంగా కాలనీ, ఆరీస్టీ కాలనీ, శ్రీనివాస కాలనీ పరిసర ప్రాంతాలను ఎన్టీఆర్నగర్ డివిజన్లో కలుపడంతో పాటుగా కొత్తపేట డివిజన్‌కే చెందిన స్నేహపురికాలనీ, న్యూ నాగోలు, శృంగేరీ కాలనీ, మోహన్‌నగర్ కాలనీ పరిసర ప్రాంతాలను ఆర్కేపురం డివిజన్‌లోకి కలిపారు.
దీనిని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఈ కాలనీలను కొత్తపేట డివిజన్‌లోనే ఉంచాలంటూ వారు కోరుతున్నారు. అంతేకాక కొత్తపేటకే చెందిన పాత మారుతీనగర్, న్యూ మారుతీనగర్‌లోని కొంత ప్రాంతాన్ని సైతం చైతన్యపురి డివిజన్లో అదనంగా చేర్చి కొత్తపేట డివిజన్‌ను మూడు ముక్కలు చేశారు. ఈ డివిజన్ల విభజనలో అటు, ఇటుగా మారిన కా లనీల వాసులు తమ నివాసాలు ఏ డివిజన్లో వస్తాయో తెలుపాలని కోరుతున్నా సంబ ంధిత అధికారులు వీటికి సంబంధించిన సమగ్రమైన రికార్డులు తమ వద్ద లేవని చెబుతున్నారు.
మ్యాప్‌లలో చూపిన మాదిరిగానే విభజన పక్రియ ముగిసిందంటున్నారు. దీంతో కాలనీలవాసులు, బస్తీల వాసులు అయోమయం చెందుతున్నారు. అదే విధంగా లాల్ బహదూర్ శాస్త్రీ పేరుతో ఉన్న ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎల్బీనగర్ పేరుతో డివిజన్‌ను ఏర్పాటు చేయాలని కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని నూతన డివిజన్‌గా మార్చాలని, అలా కాని పక్షంలో ప్రస్తుతం తమ ప్రాంతం ఉన్న ఎన్టీఆర్నగర్ డివిజన్‌ను ఎల్బీనగర్గా మార్చాలని వారు కోరుతున్నారు. ఈ విషయంలో ఆందోళనలు, నిరసనలు చేయడంతో పాటుగా అధికారులు, నాయకుల చుట్టూరా వారు వినతిపత్రాలు సమర్పిస్తు తిరుగుతున్నారు.
ఇక నాగోలు సర్కిల్ కార్యాలయం విషయంలోనూ స్థానికులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సర్కిల్ కార్యాలయం ప్రస్తుతం పెద్ద అంబర్పేట్ కార్యాలయంలో కొనసాగుతోంది. అయితే ఈ సర్కిల్ కార్యాలయం అందరికీ అందుబాటులో లేదని, దానిని హయత్నగర్కేంద్రంలోని మండల కార్యాలయంలోకి మార్చాలని వారు కోరుతున్నారు. సర్కిల్లోని నాగోలు, మన్సూరాబాద్, లెక్చరర్స్ కాలనీ, కుంట్లూరు, పెద్ద అంబర్పేట్ డివిజన్ల అన్ని ప్రాంతాలకు హయత్‌నగర్ సెంటర్ అవుతుందని వారు పేర్కొంటున్నారు. ఇలా చాలా ప్రాంతాల్లో ప్రజల అభ్యంతరాలు, అనుమానాలు మాత్రం అలాగే ఉంటున్నాయి. ఈ విషయంలో అధికారులు అన్ని డివిజన్ల వివరాలు సమగ్రంగా సర్కిల్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచి వారి సందేహాలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.