సిటీబ్యూరో, జనవరి 14 (నమస్తే తెలంగాణ) ;పాలనా సౌలభ్యం అంటూ జీహెచ్ఎంసీలో 27 పురపాలికలను విలీనం చేసిన ప్రభుత్వం.. లక్ష్యాల అమలులో మాత్రం విఫలం అవుతోంది. ముఖ్యంగా నిర్మాణదారులకు కొత్త సమస్యను తెచ్చి పెడుతున్నది. ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం కుదేలై విలవిలలాడుతుంటే.. మూలిగే నక్కపై తాటిపండు పడిందన్న చందంగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏల మధ్య నెలకొన్న అంతర్గత యుద్ధం (కోల్డ్‌వార్) ఇప్పుడు నిర్మాణ రంగాన్ని మరింత కుదేలు చేస్తున్నది. రెండు ప్రధాన ప్రభుత్వ సంస్థల మధ్య కొరవడిన సమన్వయం కారణంగా శివారు నిర్మాణదారుడు అల్లాడిపోతున్నాడు. కాగితాల మీద విలీనం ప్రక్రియ ముగిసినా… క్షేత్రస్థాయిలో మాత్రం ‘నీదా-నాదా’ అన్నట్లుగా సాగుతున్న రెండు శాఖల ప్రచ్ఛన్న యుద్ధం వద్ద అనుమతుల ప్రక్రియ పూర్తిగా పడకేసింది. ఈ క్రమంలోనే పాత, కొత్త ఫైళ్లు అటు వెళ్లలేక.. ఇటు తేల్చుకోలేక.. వందల అనుమతులు నిలిచిపోయాయి.
జీహెచ్ఎంసీ.. శివారు పురపాలికల (27) విలీనం తర్వాత 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా ఏర్పాటైంది. ఐతే పౌర సేవలన్నీ జీహెచ్ఎంసీ నుంచే అందుతాయని కమిషనర్ కర్ణన్ ప్రకటించారు.ఈ నేపథ్యంలోనే నిర్మాణరంగ అనుమతులు సైతం జీహెచ్ఎంసీ నుంచే వస్తాయని అందరూ భావించారు. కానీ జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ శాఖల మధ్య అధిపత్య పోరులో రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టేస్తోంది. గతంలో మున్సిపాలిటీల పరిధిలో ఉన్న గృహ నిర్మాణాల (జీ+5 అంతస్తుల వరకు) విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకపోయినప్పటికీ.. ఐదంతస్తుల కంటే ఎక్కువ నిర్మాణాల అనుమతుల విషయంలోనే అసలు సమస్య వచ్చి పడింది. బిల్డ్ నౌ ద్వారా సదరు దరఖాస్తుదారులు అప్లికేషన్ సమయంలో జీహెచ్ఎంసీకి ఐప్లె చేసిన దరఖాస్తు.. అనుమతి కోసం మాత్రం హెచ్ఎండీఏ పరిధిలోకి వెళ్తున్నది. దీంతో దరఖాస్తుదారుల్లో తీవ్ర అయోమయం నెలకొంది. విలీనమైన ప్రాంతాలకు సంబంధించి హెచ్ఎండీఏ తమ వద్ద ఉన్న లే అవుట్లు, అనుమతి పొందిన ప్లాన్ల తాలూకు డిజిటల్ డేటాను హార్డ్ కాపీలను జీహెచ్ఎంసీకి అప్పగించడం లేదు. తద్వారా బిల్డ్ సౌ సాఫ్ట్‌వేర్‌లో ఇంటిగ్రేషన్ చేసే సాంకేతిక సమస్య ద్వారానే ఫైళ్ల క్లియరెన్స్‌లో ఆలస్యం అవుతోంది అని పైకి చెబుతున్నప్పటికీ బహుళ, వాణిజ్య సంస్థల నిర్మాణాల అనుమతులకు సంబంధించి అధికారాన్ని వదులుకునేందుకు హెచ్ఎండీఏ సిద్ధంగా లేదు. హెచ్ఎండీఏకు ప్రధాన ఆదాయం ఇక్కడి నుంచే వస్తుండటంతో అది ససేమిరా అనడంతో రెండు శాఖల మధ్య నెలకొన్న పంచాయితీ సర్కారు కోర్టులోకి వెళ్లింది.
పడకేసిన పరిపాలన..
ఒకవైపు ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంటే.. క్షేత్రస్థాయిలో మాత్రం అధికారుల మొండివైఖరి వల్ల ఖజానాకు గండి పడుతోంది. హెచ్ఎండీఏ తన పట్టును వదులుకోలేక, జీహెచ్ఎంసీ తన బాధ్యతను స్వీకరించలేక సాగిస్తున్న ఈ ప్రచ్ఛన్న యుద్ధం హైదరాబాద్ అభివృద్ధికి గొడ్డలిపెట్టుగా మారింది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఈ ఫైళ్ల బదలాయింపు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయకపోతే, రాబోయే రోజుల్లో నిర్మాణరంగం మరింత కుదేలయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు శాఖల మధ్య ఈ కోల్డ్‌వార్‌తో వేలకోట్ల రూపాయల ప్రాజెక్టులు హోల్డ్‌లో పడిపోయాయని అంటున్నారు. ఇప్పటికే అనుమతుల కోసం ఫీజులు చెల్లించిన వారు, కొత్తగా దరఖాస్తు చేసుకుందామనుకునే వారు ఎవరిని సంప్రదించాలో తెలియక తలలు పట్టుకుంటున్న పరిస్థితులు నెలకొనడం గమనార్హం.