సిటీబ్యూరో, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): భవన నిర్మాణ అనుమతుల విషయంలో జీహెచ్ఎంసీ-హెచ్ఎండీఏ మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు మరింత ముదురుతున్నది. పాత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జీహెచ్ఎంసీకి ఉన్న అధికారాలను క్రమంగా కత్తిరిస్తున్న ప్రభుత్వం.. అదే సమయంలో బాధ్యతలను హెచ్ఎండీఏకు బదిలీ చేయకుండా కాలయాపన చేస్తున్నది. దీంతో అటు హైదరాబాద్ మెట్రోపాలిటన్ సంస్థల మధ్య పంచాయితీ తీరు మారుతోంది. ఓవైపు అధికారాలను పూర్తిగా హెచ్ఎండీఏ చేతుల్లోనే కేంద్రీకరించేందుకు ప్రభుత్వం యోచిస్తుంటే, అవే అధికారాలను కోల్పోవడానికి జీహెచ్ఎంసీ సిద్ధంగా లేకపోవడంతో మున్సిపల్ విభాగాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు.
కొత్తగా 27 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో జీహెచ్ఎంసీ పరిధి ఒక్కసారిగా 2053 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. కానీ విలీన ప్రాంతాల్లోని భవన, లే-అవుట్ అనుమతులను ఇప్పటికీ హెచ్ఎండీఏనే జారీ చేస్తున్నది. ఇప్పటివరకు ఈ అధికారాలను జీహెచ్ఎంసీకి బదిలీ చేయకపోగా, ఉన్న అధికారాలను కూడా తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ మధ్య మొదలైన ఆధిపత్య పోరుతో జనాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తలలు పట్టుకుంటున్నారు. 10 అంతస్తుల లోపు, ఆ పైబడిన అంతస్తుల భవనాల విషయంలో రెండుగా చీలిన అనుమతుల విధానంతో దరఖాస్తు చేయడమే గందరగోళంగా మారింది.
యూనిఫైడ్ బిల్డింగ్ కోడ్ పేరిట జాప్యం…
హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ పరిధిలోని అభివృద్ధి అధికారాలను పూర్తిగా హెచ్ఎండీఏకే కట్టబెట్టే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే యూనిఫైడ్ బిల్డింగ్ కోడ్ను రూపొందిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. భవిష్యత్తులో హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న, జీహెచ్ఎంసీ పరిధిలోనైనా, లేదా ప్రతిపాదిత గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధుల్లోనైనా ఏకరూప విధానాలను పర్యవేక్షించడంలో హెచ్ఎండీఏ కీలకపాత్రను పోషించనుంది. ఇదే ఇప్పుడు జీహెచ్ఎంసీ ఆదాయాన్ని ప్రభావితం చేస్తోంది. 10 అంతస్తులు దాటిన భవనాల అనుమతులు, లే-అవుట్ అనుమతులను హెచ్ఎండీఏనే జారీ చేయనుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
విలీన ప్రాంతాల్లో గందరగోళం..
జీహెచ్ఎంసీలో విలీనమైన 27 మున్సిపాలిటీల్లో గతంలో కమిషనర్ల ద్వారా 1000 చదరపు గజాల స్థలంలో రెసిడెన్షియల్ భవనానికి నాలుగు అంతస్తులు, కమర్షియల్ భవనానికి ఐదు అంతస్తుల వరకు అనుమతులు జారీ అయ్యాయి. కానీ జీహెచ్ఎంసీ విలీనానంతరం ఈ ప్రాంతాల్లో అనుమతుల విషయంలో పూర్తిస్థాయి అయోమయం నెలకొంది. అధికారాలను జీహెచ్ఎంసీకి బదిలీ చేయకపోవడంతో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలోనే అనుమతులు కొనసాగుతున్నాయి.
అయోమయంలో జనాలు..
ప్రభుత్వ సంస్థల మధ్య పోరుతో సామాన్య ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఆన్లైన్ విధానం ఉన్నా.. దరఖాస్తు చేసిన ఫైల్ జీహెచ్ఎంసీకి వెళ్తుందా? లేదా హెచ్ఎండీఏకు వస్తుందా? అన్న సందిగ్ధంలో ప్రజలు, బిల్డర్లు కూడా పడుతున్నరు. ఇక గతంలో దరఖాస్తు చేసిన ఫైళ్లు కదలడం లేదు. దీంతో నిర్మాణాలు నిలిచిపోతున్నాయి. అయితే జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారాలు, విధులకు సంబంధించిన ఉత్తర్వులు ఫిబ్రవరి 10 తర్వాత ఎప్పుడైనా వెలువడే అవకాశం ఉందని ప్లానింగ్ అధికారులు చెబుతున్నారు. అప్పటివరకు ఇదే గందరగోళ పరిస్థితి కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ సర్కారు తీసుకు వచ్చిన బిల్డ్ నౌ విధానంలోనూ ఇప్పటికీ పెరిగిన పరిధికి అనుగుణంగా మార్పులు, చేర్పులు జరగలేదు. దీంతో అనుమతుల విధానంలో అసలు ఏం జరుగుతోందని రియల్ వ్యాపారులు, సాధారణ జనం అయోమయానికి గురవుతున్నారు.