ఉప్పల్, డిసెంబర్ 5 : ఉప్పల్ సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాల తొలగింపునకు రంగం సిద్ధం అవుతున్నది. అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను కూల్చివేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఉప్పల్లో అక్రమ నిర్మాణాలపై స్వచ్ఛంద సంస్థలు, పలువురు సామాజికవేత్తలు ఫిర్యాదులు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయని, వాటి పై తక్షణ చర్యలు చేపట్టాలని గ్రివెన్స్సెల్కు, ఆన్లైన్లో ఫిర్యాదులు చేస్తున్నారు. ఫిర్యాదులు భారీగా వస్తుండటంతో ఉప్పల్ సర్కిల్ అధికారులు అక్రమ నిర్మాణాల తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నారు.
అక్రమ నిర్మాణాలను నియంత్రించేందుకు ప్రత్యేక వి భాగం పనిచేస్తుంది. ఈ మేరకు సర్కిల్ పరిధిలో చేపడుతున్న అక్రమ నిర్మాణాలను గుర్తిస్తూ.. వాటి ఆధారంగా కూల్చివేస్తున్నారు. అయితే.. నిర్మాణాల గుర్తింపులో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నార ని, పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో అ క్రమ నిర్మాణాలపై 50కిపైగా ఫిర్యాదులు అందినట్లు తెలుస్తుంది.
సర్కిల్ పరిధిలో భారీ సంఖ్యలో అక్రమంగా షెడ్ల నిర్మాణాలు చేపడుతున్నారని గతంలోనే ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు అధికారులు షెడ్ల నిర్మాణదారులకు నోటీసులు అందజేసి, కూల్చివేతలు చేపట్టారు. కానీ.. కొద్దిరోజులకే మళ్లీ షెడ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. వీటిపై అధికారులకు మళ్లీ ఫిర్యాదులు అందాయి. దీంతో అధికారులు అక్రమ నిర్మాణదారులపై కన్నెర్ర చేస్తూ.. కూల్చివేతకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.
అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదుల నేపథ్యంలో టీపీఎస్ మౌనిక బదిలీ చర్చాంశనీయంగా మారింది. గతకొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న మౌనికకు భారీగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో.. ఆమె బదిలీ కావడం విమర్శలకు తావిస్తుంది. సర్కిల్లో ఒక్కరే టీపీఎస్ ఉండటం, పనిభారం పెరగడంతో కూల్చివేతలపై ఆలస్యం జరుగుతుందని, అక్ర మ నిర్మాణాలపై పర్యవేక్షణ లోపిస్తుందని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు.