కేపీహెచ్బీ కాలనీ, మార్చి 15 : కాలనీలు బస్తీలలో రోడ్లపై ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం కనిపిస్తుండడం.. ప్రజా అవసరాల కోసం అందుబాటులోకి తెచ్చిన స్వచ్ఛ టాయిలెట్లు పరిశుభ్రంగా లేకపోవడం, ఇంటింటికీ స్వచ్ఛ ఆటోలు వెళ్లకపోవడం.. కొన్ని ప్రాంతాల్లో పారిశుధ్య కార్మికులు బాధ్యతగా పనిచేయకపోవడం వల్ల వందశాతం స్వచ్ఛతను సాధించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పడుతున్నాయి. పారిశుధ్య విభాగంలో పలు సంస్కరణలు తీసుకొచ్చినా బాధ్యత నాదికాదంటూ.. నెపం మరొకరిపై వేస్తూ తప్పించుకునే ప్రయత్నాలే కనిపిస్తుంటాయి. ఇలాంటి సమస్యలను పరిష్కరించే దిశగా జీహెచ్ఎంసీ కొత్త విధానాలను అమల్లోకి తెచ్చింది. ఇకపై రోడ్లపై చెత్త, వ్యర్థాలు కనిపించినా.. స్వచ్ఛ ఆటోలు ప్రతీ ఇంటినుంచి చెత్తను సేకరించకున్నా.. పబ్లిక్ స్వచ్ఛ టాయిలెట్లు పరిశుభ్రంగా లేకుంటే సంబంధిత అధికారులు, సిబ్బంది, ఏజెన్సీలపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.
వందశాతం స్వచ్ఛత..
కాలనీలు బస్తీలలో వందశతం స్వచ్ఛతను సాధించే దిశగా జీహెచ్ఎంసీ కసరత్తును ముమ్మరం చేసింది. ఆయా సర్కిళ్ల పరిధిలో పనిచేస్తున్న అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక బాధ్యతలను అప్పగించింది. దీనిలో భాగంగా కూకట్పల్లి, మూసాపేట సర్కిళ్ల పరిధిలో ఎస్ఎఫ్ఏల పర్యవేక్షణలో ఉన్న ప్రాంతాలలోని అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక బాధ్యతలను అప్పగించారు. ఒక ఎస్ఎఫ్ఏ ప్రతిరోజూ పారిశుధ్య కార్మికులతో కేటాయించిన రోడ్లను పరిశుభ్రంగా చేయించడం, పారిశుధ్య కార్మికుల బయోమెట్రిక్ హాజరు తీసుకోవాలి. ఇదేసమయంలో ఆ ప్రాంతంలో తరచుగా చెత్త పడుతున్న జీవీపీ పాయింట్లను గుర్తించి అక్కడ చెత్త పడడానికి కారణాలను గుర్తించాలి. ఆ సమీప కాలనీలు బస్తీలలో ప్రతీ ఇంటికి స్వచ్ఛ ఆటో వెళ్తుందా.. లేదా అని పరిశీలించాలి. స్వచ్ఛ ఆటో డ్రైవర్ తప్పిదమున్నా.. ఇంటి యజమాని తప్పిదమున్నా గుర్తించాలి. రోడ్లపై పడిన చెత్తాచెదారాన్ని సకాలంలో వాహనాలలో తరలిస్తున్నారా లేదా అన్న విషయాన్ని గమనించాలి. అదేవిధంగా ఆ ప్రాంతంలో పబ్లిక్ టాయిలెట్లు ఉంటే ఆ టాయిలెట్ పరిశుభ్రంగా ఉందాలేదా, నీటి వసతి ఉందాలేదా..? తెలుసుకోవాలి. ఈ విషయాలన్నింటినీ జీహెచ్ఎంసీకి చెందిన యాప్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలి. ఏదైనా అంశంపై స్పందించకుంటే సంబంధిత అధికారి, ఎస్ఎఫ్ఏలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారు.
ప్రజలు సహకరించాలి..
సంపూర్ణ స్వచ్ఛతను సాధించేందుకు ప్రజలందరూ సహకరించాలి. స్వచ్ఛ ఆటోలోనే తడి-పొడి చెత్తను వేర్వేరుగా వేయాలి. ఖాళీ స్థలంలో చెత్తను వేయడం మానుకోవాలి. స్వచ్ఛ ఆటో ఇంటికి రాకుంటే ఫిర్యాదు చేయాలి. పబ్లిక్ టాయిలెట్లు పరిశుభ్రంగా ఉండి ప్రజలందరూ వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎస్ఎఫ్ఏలకు కీలక బాధ్యతలు అప్పగించాం. నిర్లక్ష్యంగా ఉంటే ఏజెన్సీలపైన, సిబ్బందిపైన చర్యలు తీసుకుంటాం.
– కె.రవికుమార్, డీసీ, మూసాపేట సర్కిల్