సిటీబ్యూరో, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో వీధి కుక్కల బెడదతో పాటు కోతుల సమస్య జీహెచ్ఎంసీకి తలనొప్పిగా మారింది. వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లే.. కోతుల బెడద నుంచి రక్షించాలని బాధితులు ఇటీవల బల్దియా టోల్ ఫ్రీ నంబర్‌కు, చార్మినార్ జోన్లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదులు చేశారు. తలుపులు తెరిచినప్పుడు, కిటికీల ద్వారా ఇళ్లలోకి చేరి గదుల్లోని సామగ్రిని చిందర వందర చేయడం, మనుషులపై దాడి చేయడం జరుగుతుందని, దేవాలయాల వద్ద కొబ్బరి చిప్పలు, అరటిపండ్ల వంటి వాటికోసం పైకి ఎగబడి భక్తులను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయని పేర్కొన్నారు.
కోతులతో విసిగిపోతున్నట్లు ప్రజల నుంచి జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు రావడం, వీటికి శాశ్వత చెక్ పెట్టడంలో జీహెచ్ఎంసీ అధికారులకు సవాల్‌గా మారింది. అధిక శాతం ఈస్ట్ మారేడ్‌పల్లి, వెస్ట్‌మారేడ్‌పల్లి, పద్మారావునగర్, సికింద్రాబాద్, అల్వాల్, ఉప్పల్, తార్నాక, అమీర్‌పేట, కాప్రా, డీబీఆర్ మిల్స్, టెలికాం నగర్, కోఠి, నల్లకుంట తదితర ప్రాంతాల్లో ఇళ్లలోకి వస్తున్న కోతులతో ప్రజలు.. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు భయంతో వణికిపోతున్నారు. అధికారులు జోన్ల వారీగా కోతులను నగరం నుంచి అటవీ ప్రాంతానికి తరలించేందుకు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం.
ఇందుకు కారణం నిబంధనలు కఠినంగా ఉండటమే. కోతికి ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా జాగ్రత్తగా పట్టుకునే నైపుణ్యం ఉన్న సిబ్బంది లేకపోవడమే. కాగా ఢిల్లీ తదితర మెట్రో నగరాల్లో కోతులను పట్టుకునే నైపుణ్యమున్న ఏజెన్సీలకు ఒకో కోతికి రూ.5వేల నుంచి రూ.6 వేల వరకు చెల్లిస్తున్నారు. జీహెచ్ఎంసీ గరిష్టంగా రూ.1800 చెల్లించేందుకు మాత్రమే టెండర్ పెడుతుండటం, ఈ ధర గిట్టుబాటు కాకపోవడంతో ఎవరూ ముందుకు రావడం లేదని పేర్కొంటున్నారు. కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.