సిటీబ్యూరో, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీలో కీలకమైన విజిలెన్స్ విభాగం ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. సంస్థకు సంబంధించి వివిధ అభివృద్ధి పనుల్లో అవినీతి, అక్రమాలు, అధికారులపై వచ్చిన ఆరోపణలపై అంతర్గతంగా విచారణ జరిపి కమిషనర్‌కు నివేదిక అందించాల్సిన విజిలెన్స్ విభాగాన్ని నిర్వీర్యం చేసే దిశగా అడుగులు పడుతున్నాయన్న చర్చ ఇప్పుడు సంస్థలో మొదలైంది. దీనికి హైడ్రా ఆజ్యం పోసిందని హాట్ హాట్ చర్చ జరుగుతున్నది.
హైడ్రా ఏర్పాటుతో అప్పటి వరకు ఉన్న ఈవీడీఎంలోని విజిలెన్స్ విభాగాన్ని బల్దియాకు బదిలీ చేసింది. అయితే ఈ సమయంలో విజిలెన్స్‌కు సంబంధించిన కానిస్టేబుళ్లు, ఎస్ఐ, సీఐ, ఏసీపీలు బల్దియాకి రిపోర్టు చేయాల్సి ఉంటుంది. కానీ దాదాపు నెల రోజులు దాటినా ఇప్పటి వరకు అదనపు కమిషనర్ విజిలెన్స్‌కు రిపోర్టు చేయలేదు. దీంతో హైడ్రా ఆఫీసులోనే ఉద్యోగాలు చేస్తున్నారు. జీతం మాత్రం బల్దియాలో తీసుకుంటూ హైడ్రా కార్యాలయంలో ఎలా పనిచేస్తారంటూ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విజిలెన్స్ విభాగానికి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న అడ్మిన్ విభాగం అదనపు కమిషనర్ నళిని పద్మావతి హైడ్రాలో పనిచేస్తున్న విజిలెన్స్ స్టాఫ్‌ను వెంటనే రిలీవ్ చేయాలని హైడ్రా కమిషనర్‌కు లేఖ రాసినా ఫలితం లేదు. హైడ్రాకు సైబరాబాద్ కమిషనరేట్ నుంచి 22 మంది పోలీస్ అధికారులను నియమించారు. వీరి రాకతోనైనా విజిలెన్స్ విభాగానికి రావాల్సిన ఉద్యోగులు రిలీవ్ చేస్తారా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే..!!