సిటీబ్యూరో, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : పర్యావరణ పరిరక్షణ, మానవాళి మనుగడ కోసం గణేశ్ మట్టి విగ్రహాల పంపిణీపై జీహెచ్ఎంసీ, పీసీబీ, హెచ్ఎంసీ దృష్టి సారించాయి. ఈ నెల 27న వినాయక చవితి పండుగ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 4 లక్షల మట్టి గణపతుల విగ్రహాలను పంపిణీ చేసేందుకు ఆయా శాఖలు ఏర్పాట్లు చేస్తున్నాయి. హెచ్ఎండీఏ రెండు లక్షలు, పీసీబీ లక్ష, జీహెచ్ఎంసీ లక్ష చొప్పున గణేశ్ ప్రతిమలను పంపిణీ చేయనున్నారు.
ఈ మేరకు టెండర్ల ప్రక్రియ వారం రోజుల్లో ముగించి ప్రత్యేక సెంటర్లను ఏర్పాటు చేసి భక్తులకు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. 150 వార్డులు ఉండగా, వార్డుకు రెండున్నర వేల నుంచి 3వేల చొప్పున ఉచితంగా మట్టి విగ్రహాలను జీహెచ్ఎంసీ పంపిణీ చేయనున్నారు. మూడు కేటగిరీల్లో 8 అంగుళాలు, ఒక అడుగు ఎత్తు, అడున్నర ఎత్తులో తయారీ చేసిన విగ్రహాలను భక్తులకు అందించనున్నారు.