సిటీబ్యూరో, మే 13 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో ప్రధాన పర్యాటక ప్రాంతమైన చార్మినార్ వద్ద ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా జీహెచ్ఎంసీ అడుగులు వేస్తోంది. చార్మినార్ చూసేందుకు ఎకడెకడి నుంచో… కుటుంబ సమేతంగా, స్నేహితులతో కలిసి పర్యాటకులు వస్తుంటారు. అయితే.. ఇలా వచ్చే వాళ్లను ఏళ్ల తరబడి పారింగ్ సమస్య వెంటాడుతూనే ఉంది. నగరం నడిబొడ్డున చార్మినార్ ఉండటం, స్ట్రీట్ షాపింగ్‌తో పాటు నిత్యం పర్యాటకుల రద్దీ అధికంగా ఉండటం.. వాహనాలను పారింగ్ చేసేందుకు స్థలం లేక పర్యాటకులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే వీటికి చెక్ పెట్టేందుకు చార్మినార్ వద్ద మల్టీలెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని జీహెచ్ఎంసీ ఇటీవల నిర్ణయించింది.
ఇందుకుగానూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) పద్ధ్దతిలో పనులు చేపట్టేందుకు టెండర్లను కూడా ఆహ్వానించింది. ఈ మేరకు ఆసక్తి గల ఏజెన్సీలు ముందుకు వచ్చి ప్రతిపాదనలు సమర్పించాలని కోరింది. చార్మినార్ పరిసర ప్రాంతంలో అత్యాధునిక టెక్నాలజీతో మూడు అంతస్తుల్లో మల్టీ లెవల్ పారింగ్ కాంప్లెక్స్ నిర్మించనున్నారు. జీహెచ్ఎంసీ కేవలం స్థలం మాత్రమే ఇవ్వనుండగా, పనులు దక్కించుకున్న ఎజెన్సీ నిర్మాణంతో పాటు 15 ఏండ్ల పాటు నిర్వహణ బాధ్యతలు చూడనుంది. అయితే వచ్చిన ఆదాయంలో కొంతమేర ఆదాయాన్ని సదరు ఎజెన్సీ ప్రతి ఏటా జీహెచ్ఎంసీకి అందించాల్సి ఉంటుంది. ఈ మల్టీ లెవెల్ పారింగ్ కాంప్లెక్స్‌ను సుమారు 3,493 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 3 బేస్మెంట్ స్థాయిల్లో, మూడు అంతస్తుల్లో నిర్మించనున్నారు. ఈ కాంప్లెక్స్ లో దాదాపు 150 ఫోర్ వీలర్ వెహికిల్స్, టూ వీలర్ పెయిడ్ పారింగ్ ఏర్పాట్లు ఉండనున్నాయి. అదనంగా బేస్ మెంట్, గ్రౌండ్ ఫోర్లలో హ్యాకర్ల కోసం కమర్షియల్ ప్లేస్‌లను కూడా కేటాయించనున్నారు. అయితే గత ఏడేళ్లుగా ఈ మల్టీలెవల్ పార్కింగ్ బిల్డింగ్ నిర్మాణ పనులు పెండింగ్ పడుతూనే వస్తాయి. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని చేతులెత్తేసిన కాంగ్రెస్ సర్కార్.. ఈ ప్రాజెక్ట్ పూర్తిచేయడంలో సఫలం అవుతుందో లేదో వేచిచూడాలి.