
హైదరాబాద్ : జరిమానాలు చెల్లించని పలు వాణిజ్య సంస్థలకు జీహెచ్ఎంసీ భారీ షాక్ ఇచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు ఐదు వాణిజ్య సంస్థలను సీజ్ చేశారు. అమీర్‌పేటలో ఓ షాపింగ్ మాల్, మాదాపూర్, జూబ్లీహిల్స్‌లోని రెండు ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీలతో పాటు అబిడ్స్‌లోని నిర్మాణ రంగ సంస్థను, మియాపూర్‌లోని ఓ ఆస్పత్రిని అధికారులు సీజ్ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ విధించిన జరిమానాలు చెల్లించకపోవడంతోనే ఈ ఐదింటిని సీజ్ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.
ప్రకటనల నిబంధనలను ఉల్లంఘించడంతోనే జరిమానాలు విధించామని తెలిపారు. రూ. 2.1 లక్షల నుంచి రూ. 38 లక్షల వరకు జరిమానాలు విధించామని చెప్పారు. అడ్వటైజ్మెంట్ పాలసీ ప్రకారం.. ప్రకటనలకు సంబంధించిన వస్తువులు 15 ఫీట్ల ఎత్తు కలిగి ఉండకూడదు. ఇది చట్టవిరుద్ధం అని పేర్కొన్నారు. ఫ్లాషింగ్ లైట్స్ లేదా నాన్ స్టాటిక్ ఇల్యుమినేషన్ ప్రకటనలకు అధికారుల అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకుని 2020లో ప్రకటనల నిబంధనలను మార్చినట్లు పేర్కొన్నారు.