GHMC | బంజారాహిల్స్, ఏప్రిల్ 21: జీహెచ్ఎంసీ సర్కిల్-18 పరిధిలో పారిశుద్ధ్య విభాగం నిద్రమత్తులో జోగుతోంది. వాణిజ్య సముదాయాలు, షాపుల వద్ద నుంచి మామూళ్ల వసూలుతో పాటు ఫుట్‌పాత్‌లపై చిరువ్యాపారాలను ఏర్పాటు చేయించడం, నెలవారీ అద్దెలు వసూలు చేయడం మినహా పారిశుద్ధ్య నిర్వహణను గాలికి వదిలేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు స్వచ్చ సర్వేక్షన్ పేరుతో జీహెచ్ఎంసీ పరిధిలో సర్వేలు నడుస్తుండగా ప్రముఖులు నివాసం ఉంటున్న సర్కిల్-18లో మాత్రం ఎక్కడ చూసినా చెత్తకుప్పలు దర్శనం ఇస్తున్నాయి.
రోజుల తరబడి చెత్తాచెదారం తొలగించకపోవడం, రోడ్లపక్కన వ్యర్థాలను డంపింగ్ చేస్తున్నా పట్టించుకోకపోవడంతో బస్తీలు, కాలనీలు కంపుకొడుతున్నాయి. ముఖ్యంగా బంజారాహిల్స్, వెంకటేశ్వర కాలనీ, జూబ్లీహిల్స్ డివిజన్ల పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణతో స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పారిశుద్ధ్య విభాగం బాధ్యతలు చూసే ఏఎంవోహెచ్ క్షేత్రస్థాయిలో పర్యటించకుండా కేవలం ఎస్ఎఫ్ఏల మీదనే ఆధారపడటంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీనికితోడు శానిటేషన్ విభాగం పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్షలు చేయాల్సిన డీఎంసీ కూడా పట్టించుకోకపోవడంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. స్వచ్ఛత కోసం పాటుపడాల్సిన పారిశుద్ధ్య విభాగం సిబ్బంది కేవలం సంపాదనే ధ్యేయంగా పనిచేస్తుండటమే ఈ పరిస్థితికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒక్కో ఎస్ఎఫ్ఏ ఆదాయం లక్షల్లో ఉంటుందనే ఆరోపణలు ఉన్నాయి. చేయాల్సిన పనులను పక్కన పెట్టి కేవలం కాసులు దండుకునేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నుంచి బ్రహ్మకుమారీస్ వెళ్లే దారిలో సుమారు నెలరోజులుగా చెత్త కుప్పలు, వ్యర్థాలు పేరుకుపోయినా పారిశుద్ధ్య విభాగ సిబ్బంది పట్టించుకున్న పాపాన పోలేదు. జూబ్లీహిల్స్ రోడ్ నెం 36లో జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ వెనకాల ఖాళీ స్థలంలో రోజూ చెత్తను తొలగించాలని ఏకంగా మేయర్ ఆదేశించినా 15 రోజులకు ఒకసారి కూడా చెత్తను తొలగించడం లేదు. బంజారాహిల్స్ రోడ్ నెం 2లోని ఇందిరానగర్ నుంచి జవహర్‌నగర్‌కు వెళ్లే రోడ్డులో చెత్త సమస్య నెలల తరబడి కొనసాగుతుంది. అక్కడ డస్ట్ బిన్ లేకపోవడంతో గుట్టలుగా చెత్తను వేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నెం 2 ప్రధాన రహదారి వైపు కొత్తగా వేసిన రోడ్లపై చెత్తాచెదారం పేరుకుపోతోంది. జూబ్లీహిల్స్ సొసైటీలోని పలు వీధుల్లో ఎక్కడ చూసినా చెత్తాచెదారంతో పాటు నిర్మాణ వ్యర్థాలు, చెట్లకొమ్మలతో అపరిశుభ్రకరమైన వాతావరణం నెలకొంది. ఫిలింనగర్ కాలనీలో చెత్తను తరలించడంలో జాప్యం చేస్తుండటంతో ఎక్కడపడితే అక్కడ పారవేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని బస్తీలు, కాలనీల్లో చెత్త సమస్యలపై నిత్యం ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.