సిటీబ్యూరో, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ ): జీహెచ్ఎంసీలో 300 వార్డుల పునర్విభజనపై అభ్యంతరాలు వెల్లువలా వస్తున్నాయి. ఓటర్ల సంఖ్య, భౌగోళిక స్వరూపం, సరిహద్దులను పకడ్బందీగా విభజించాల్సిన ప్రక్రియను హడావుడిగా, అశాస్త్రీయ పద్ధతిలో చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జీహెచ్ఎంసీ కార్యాలయాలకు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలోనే డీలిమిటేషన్‌పై అభ్యంతరాలు, సలహాల స్వీకరణ గడువు తుది దశకు చేరింది. ఇప్పటి వరకు బీఆర్ఎస్, ఎంఐఎం ఎమ్మెల్యేలు, బీజేపీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున పునర్విభజన జరుగుతున్న తీరుపై విమర్శించారు.
ఇప్పటి వరకు 4577 మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. మంగళవారం ఒక్కరోజే 1475 మంది లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రధానంగా అభ్యంతరాలను 40 వేల ఓటర్లకు మించకుండా వార్డులను ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ఉన్న వార్డుల పేర్లను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే నిబంధనల మేరకు దరఖాస్తులను పరిష్కరిస్తామని కమిషనర్ స్పష్టం చేశారు. లిఖిత పూర్వకంగా అభ్యంతరాలు ఇవ్వడానికి బుధవారం (నేటి)తో చివరి రోజని కమిషనర్ కర్ణన్ ప్రకటించారు. వార్డుల పేర్ల మార్పుపై ఎక్కువగా అభ్యంతరాలు వచ్చాయని, కొన్ని ప్రాంతాల్లో బౌండరీలపై, వార్డులు ఎక్కువగా పెంచాలని, పోలింగ్ స్టేషన్ల అలైన్మెంట్ మార్పు, డీటెయిల్డ్ మ్యాప్ తదితర అభ్యంతరాలు నమోదయ్యాయని, వాటిని నిబంధనల మేరకు కమిటీ ద్వారా పరిష్కరిస్తామని కమిషనర్ తెలిపారు. ప్రతి అభ్యంతరాన్ని సమగ్రంగా పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
నేటితో ముగియనున్న గడువు
జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనపై అభ్యంతరాలు, సలహాలు, సూచనల స్వీకరణకు ఈ నెల 17 తుది గడువు అని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ.కర్ణన్ తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్, సర్కిల్ స్థాయిలో పుర ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరిస్తామని తెలిపారు. తమ అభ్యంతరాలు, సలహాలు, సూచనలను స్పష్టంగా తెలిసేలా రాస్తే నిబంధనల మేరకు పరిష్కారం సులభం అవుతుందన్నారు. వార్డుల పునర్విభజనకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్‌పై ప్రజల్లో అవగాహన లేదని, వారం రోజుల గడువును పెంచాలని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు విన్నవించగా.. పొడగింపుపై కమిషనర్ నిర్ణయం తీసుకుంటారా? లేదా? అన్నది వేచి చూడాలి.