GHMC | సిటీబ్యూరో, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ ) : ఎల్బీనగర్ నుంచి ఆరాంఘర్ వరకు ఉన్న ఇన్నర్ రింగు రోడ్లుపై కొత్తగా నాలుగు ఫ్లై ఓవర్ల నిర్మాణానికి జీహెచ్ఎంసీ సన్నద్ధమవుతున్నది. హెచ్-సిటీ ప్రాజెక్టులో భాగంగా ఎల్బీనగర్-ఆరాంఘర్ ప్రాంతాల మధ్య ఐఆర్ఆర్ (ఇన్నర్ రింగు రోడ్డు)పై ఆరు లేన్ల వెడల్పుతో దాదాపు రూ.955 కోట్ల వ్యయంతో మరో నాలుగు ఫ్లై ఓవర్ల నిర్మాణానికి ఇటీవల ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగానే తొలిసారిగా డబుల్ డెక్కర్ విధానంలో నిర్మాణం చేయనుంది. ై కింద ఫ్లై ఓవర్, పైన మెట్రో మార్గం ఉండనుంది. ఈ మేరకు నాగోల్ నుంచి ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, ఆరాంఘర్ చౌరస్తా, శంషాబాద్ మీదుగా అంతర్జాతీయ విమానాశ్రయం వెళ్లే 36.8 కిలోమీటర్ల పొడవైన మెట్రో రైల్ మార్గంతో ఆయా ఫ్లై ఓవర్లను అనుసంధానం చేయనున్నారు.
నాలుగు ఫ్లై ఓవర్లను టీకేఆర్ కాలేజీ కూడలి, గాయత్రి నగర్, మందమల్లమ్మ జంక్షన్లు మీదుగా ఒకటి, ఒమర్ హోటల్ నుంచి సోయబ్ హోటల్ వరకు వయా మెట్రో ఫంక్షన్ హాల్ మీదుగా మరొకటి, బండ్లగూడ-ఎర్రకుంట క్రాస్‌రోడ్ జంక్షన్ మీదుగా మూడో ఫ్లై ఓవర్, మైలార్‌దేవ్‌పల్లి, శంషాబాద్ రోడ్డు, కాటేదాన్ జంక్షన్ల మీదుగా నాలుగో ఫ్లై ఓవర్ నిర్మాణం జరగనుంది. కాగా ఎస్ఆర్డీపీలో భాగంగా ఇప్పటికే జీహెచ్ఎంసీ ఇప్పటికే చాంద్రాయణగుట్ట, ఒవైసీ చౌరస్తా , బైరామల్‌గూడ, ఎల్బీనగర్ కూడళ్లలో ఫ్లై ఓవర్లను నిర్మించగా, తాజాగా హెచ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా నాలుగు ఫ్లె ఓవర్ల పనులను తెరమీదకు తీసుకువచ్చింది.