సిటీబ్యూరో, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ పరిధిలో మీ ఇల్లు ఉందా? ముఖ్యంగా చెరువు ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో ఏ మాత్రం ఆ పరిసరాల్లో ఉన్నా బహుపరాక్..!! ఎందుకంటే దశాబ్దాలుగా జీహెచ్ఎంసీ ఆధీనంలో ఉన్న నిర్వహణ హైడ్రా చేతుల్లోకి వెళ్లనున్నది. ఈమేరకు జీహెచ్ఎంసీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి సూత్రప్రాయంగా నిర్ణయించగా ఉప ఎన్నిక ముగియగానే హైడ్రా స్వాధీనం చేసుకుంటుందని చెబుతున్నాయి. కాగా ఇప్పటికే నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చెరువుల వద్ద నివాసం ఉంటున్న వందలాది గుడిసెలను తొలగించి వారి జీవితాలను రోడ్డుపాలు జేసింది. ఐతే హైడ్రా చేతికి జీహెచ్ఎంసీకి సంబంధించిన 185 చెరువులు హైడ్రా స్వాధీనం చేసుకుంటే మరెన్నో కుటుంబాలు ఆగం అవుతున్నాయని స్థానికుల్లో ఆందోళన నెలకొంది. దుర్గం చెరువు సమీపంలో ముఖ్యనేత తమ్ముడి ఇండ్లు ఎఫ్టీఎల్లో ఉన్నప్పటికీ ఆ ఇంటి జోలికి వెళ్లని హైడ్రా సామాన్యులజీవితాలను కోలుకోకుండా చేసింది.
గడిచిన రెండేళ్ల కాలంగా చెరువుల సుందరీకరణను జీహెచ్ఎంసీ గాలికి వదిలేసింది. చెరువుల పరిరక్షణే ధ్యేయంగా హైడ్రా విభాగాన్ని ఏర్పాటు చేశామని ఒక వైపు చెబుతున్నా..క్షేత్రస్థాయిలో చెరువుల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయలేక కబ్జాదారులకు సంబంధిత అధికారులు వంత పాడుతున్నారు. చేతిలో ఉన్న నిధులతో పరిరక్షణ, సుందరీకరణ పనులు చేపట్టి మినీ పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దాల్సిన అధికారులు గడిచిన రెండేళ్లుగా పనులపై పురోగతి చూపించడం లేదు . జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 185 చెరువుల కాపాడి పరిసరాలను అందంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాల్సిన జీహెచ్ఎంసీ సుందరీకరణ పనులను అటకెక్కించారు.. చుట్టూ బండ్, వాకింగ్ ట్రాక్‌లు, ల్యాండ్ స్క్రేపింగ్ పనులు నత్తకు నడకలు నేర్పుతున్నాయి.
ఎగువ ప్రాంతాల నుంచి మురుగునీరు భారీగా వచ్చి చేరడంతో మురుగు కంపుతో స్థానికులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే చెరువు సుందరీకరణ పనులు నిలిచిపోవడంపై జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు వెలువెత్తాయి. జీహెచ్ఎంసీ పరిధిలో తొలి విడుతగా 20 చెరువులను గత కేసీఆర్ ప్రభుత్వం సుందరీకరణ పనులను రూ. 271.33 కోట్లతో చేపట్టింది. ఐతే కాంగ్రెస్పభుత్వం వచ్చాక చెరువుల సుందరీకరణ పనులు ఏ మాత్రం ముందుకు కదలడం లేదు. రూ.60.86కోట్లతో 34 చోట్ల చేపట్టిన పనుల్లో పెద్దగా పురోగతి లేకపోవడం అధికారుల పనితీరుకు నిదర్శనం.
చెరువుల పరిరక్షణలో జీహెచ్ఎంసీ అధికారుల వైఖరి మారడం లేదు..చివరకు హైకోర్టు అక్షింతలు వేసిన పనితీరులో ఎలాంటి మార్పు కనబడటం లేదు. ఫలితంగా చెరువుల ఆక్రమణలు పెరిగిపోతున్నాయి..ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే మురుగు నీటితో దుర్గంధానికి తోడు దోమల బెడద స్థానికులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. వాస్తవంగా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో 13 చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయని, పరిరక్షణ విషయంలో జీహెచ్ఎంసీ చర్యలు తీసుకోవడం లేదన్న ‘గమన’ స్వచ్ఛంద సంస్థ ఈడీ దయాకర్ పిటిషనర్ సమగ్ర విచారణ చేపట్టిన న్యాయస్థానం జీహెచ్ఎంసీకి మొట్టికాయలు వేస్తూనే 13 చెరువుల దయనీయస్థితిపై హైకోర్టు ఇద్దరు కోర్టు కమిషనర్ల కమిటీ నియమించి విచారణ జరిపించింది.
న్యాయవాదులు ప్రవీణ్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి సభ్యులుగా నియమితులైన ఈ కమిటీ.. జీహెచ్ ఎంసీ అధికారులు, హైదరాబాద్ , రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు చెరువుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలేమిటన్నది పరిశీలించింది. జంట జిల్లాల్లోని 13 చెరువులను పరిశీలించి తమ నివేదికను ఇటీవల హైకోర్టుకు సమర్పించింది. రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్లే చెరువులు ఆక్రమణకు గురయ్యాయని హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేరొంది. ఈ చెరువుల కాలుష్యం కేవలం పర్యావరణానికి మాత్రమే కాకుండా.. ప్రజా ఆరోగ్యానికీ తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదముందని తెలిపింది.
ఈ కారణంగా పక్షులు, జంతుజాలం, జలచరాలు అంతరించిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇందులో భాగంగానే హస్మత్‌పేట బోయిని చెరువు, చందానగర్ గంగారం చెరువు, దుండిగల్ చిన్న దామెర చెరువు, మద్దెలకుంట చెరువు బైరామల్ గూడ, నల్లగండ్ల చెరువు, పెద్ద చెరువు పీర్జాదిగూడ, అంబీర్ చెరువు కూకట్ పల్లి, చిన్నరాయుని చెరువు అల్వాల్, దుర్గం చెరువు, ఉప్పల్ నల్ల చెరువు, సున్నంచెరువుల పరిరక్షణపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉన్నప్పటికీ నెలల తరబడి పరిరక్షణలో జాప్యం చేస్తుండడం గమనార్హం.