మలక్ పేట, ఏప్రిల్ 23: తమ ఉద్యోగాలు తమకు ఇచ్చి తమ కుటుంబాలను ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆదుకోవాలని కోరుతూ జీహెచ్ఎంసీ ఔట్ సోర్స్ డ్రైవర్లు, లేబర్లు బుధవారం చాదర్ఘాట్ లోని జీహెచ్ఎంసీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ ఔట్సోర్స్ ట్రాన్స్పోర్ట్ విభాగం అధ్యక్షుడు రవీందర్ మాట్లాడుతూ.. జీజిహెచ్ఎంసీలోని వివిధ జోన్ల నుంచి కార్యాలయాల్లో పనిచేసే 814 మంది ఔట్ సోర్స్ డ్రైవర్లు, లేబర్లను ఏడాదిన్నర క్రితం ఉద్యానవనాలు, పార్కులు, సరస్సుల వద్ద రక్షణ కోసం డైరెక్టర్ పంపించారని ఆయన తెలిపారు.
అందులో 120 మంది పరపతి కలిగిన ఔట్ సోర్స్ డ్రైవర్లు, లేబర్లు వారి పూర్వ స్థానాలకు బదిలీ చేయబడ్డారని, మిగిలిన 694 మంది ఏడాదిన్నర కాలం పాటు అక్కడే విధులు నిర్వహిస్తుండగా, వారిని తిరిగి పూర్వ స్థానాలకు బదిలీ చేశామని డైరెక్టరేట్ అధికారులు పంపించి వేశారు. దాంతో అక్కడి నుంచి వచ్చిన డ్రైవర్లు, లేబర్లు తమను విధుల్లోకి తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరగా, తమకు లిఖితపూర్వకంగా ఎలాంటి పత్రాలు అందలేదని, దాంతో తాము విధుల్లోకి తీసుకోలేమని, మీరు అక్కడే విధులు నిర్వహించాలని పంపించి వేశారని ఆయన తెలిపారు.
అప్పటినుంచి తాము అటు కాకుండా ఇటు కాకుండా ఉద్యోగాలను, ఉపాధిని కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ భారమై తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఆయన తెలిపారు. నిరుపేద కార్మికుల కష్టాలను సర్కార్ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పఇప్పటికైనా జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు తమ పరిస్థితులను అర్థం చేసుకొని, తమను పూర్వ స్థానాల్లోకి తీసుకొని తమ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో లేనిపక్షంలో తాము జీహెచ్ఎంసీ కార్యాలయం, ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడించడంతో పాటు ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జయమ్మ, శ్రీశైలం, సునీల్, మహేష్, జానీ, ఔట్ సోర్స్ డ్రైవర్లు, లేబర్లు పాల్గొన్నారు.