Hyderabad | జూబ్లీహిల్స్, మార్చి9: ఆస్తి పన్ను చెల్లింపులకు మార్చి 31తో గడువు ముగియనుండటంతో జీహెచ్ఎంసీ అధికారులు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలులో వేగం పెంచారు. ఈ ఏడాది 2024-25 ఆర్ధిక సంవత్సరం ముగియడానికి మరో 22 రోజులే గడువు ఉండటంతో నిర్దేశిత లక్ష్యాన్ని చేరేందుకు అధికారులు దూకుడు పెంచారు. యూసుఫ్‌గూడ సర్కిల్లో ప్రాపర్టీ ట్యాక్స్ బకాయి ఉన్న దుకాణాలను ఇంచార్జి ఏఎంసీ బాలరాజ్ ఆధ్వర్యంలో సీజ్ చేశారు.
ఆస్తిపన్ను చెల్లింపులకు జీహెచ్ఎంసీ అధికారులు ఆస్తి పన్ను విషయంలో కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతున్నారు. జీహెచ్ఎంసీ 19వ సర్కిల్లోని యూసుఫ్‌గూడ, రెహ్మత్ నగర్, వెంగళ్రావు నగర్, బోరబండ, ఎర్రగడ్డ వార్డుల్లో 9 డాకెట్స్గా విభజించి ఆస్తి పన్ను వసూలును ముమ్మరం చేస్తున్నారు. ఆస్తి పన్ను చెల్లించకుండా ఉండేవారిని ఉపేక్షించేది లేదని డిప్యూటీ కమిషనర్ జాకియా సుల్తానా హెచ్చరించారు. గడువులోపు బకాయిలు చెల్లించని వారి ఆస్తులను జప్తు చేస్తామని సపష్టం చేశారు. పాత బకాయిలతో పాటు మొత్తం ఆస్తిపన్ను చెల్లించిన వారికి వన్ టైమ్ సెటిల్మెంట్లో భాగంగా వడ్డీ పై 90 శాతం మాఫీ చేయనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆస్తిపన్ను బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు.