సిటీబ్యూరో, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ ): చెరువుల పరిరక్షణలో జీహెచ్ఎంసీ అధికారుల వైఖరి మారడం లేదు..చివరకు హైకోర్టు ఆక్షింతలు వేసిన పనితీరులో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఫలితంగా చెరువుల ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే మురుగు నీటితో దుర్గంధానికి తోడు దోమల బెడద స్థానికులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. వాస్తవంగా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో 13 చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయని, పరిరక్షణ విషయంలో జీహెచ్ఎంసీ చర్యలు తీసుకోవడం లేదన్న ‘గమన’ స్వచ్ఛంద సంస్థ ఈడీ దయాకర్ పిటిషన్‌పై సమగ్ర విచారణ చేపట్టిన న్యాయస్థానం జీహెచ్ఎంసీకి మొట్టికాయ వేస్తూనే 13 చెరువుల దయనీయస్థితిపై ఇద్దరు కోర్టు కమిషనర్ల కమిటీ నియమించి విచారణ జరిపించింది.
న్యాయవాదులు ప్రవీణ్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి సభ్యులుగా నియమితులైన ఈ కమిటీ.. జీహెచ్ఎంసీ అధికారులు, హైదరాబాద్ , రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు చెరువుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలేమిటన్నది పరిశీలించింది. జంట జిల్లాల్లోని 13 చెరువులను పరిశీలించి తమ నివేదికను ఇటీవల హైకోర్టుకు సమర్పించింది. రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్లే చెరువులు ఆక్రమణకు గురయ్యాయని హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేరొంది. ఈ చెరువుల కాలుష్యం కేవలం పర్యావరణానికి మాత్రమే కాకుండా.. ప్రజా ఆరోగ్యానికి కూడా తీవ్ర ముప్పుగా పరిణమించే అవకాశాలున్నాయని తెలిపింది.
ఆక్రమణలు, కాలుష్యం కారణంగా చెరువులపై ఆధారపడిన పక్షులు, జంతుజాలం, జలచరాలు అంతరించిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇందులో భాగంగానే హస్మత్‌పేట బోయిని చెరువు, చందానగర్ గంగారం చెరువు, దుండిగల్ చిన్న దామెర చెరువు, మద్దెలకుంట చెరువు బైరామల్ గూడ, నల్లగండ్ల చెరువు, పెద్ద చెరువు పీర్జాదిగూడ, అంబీర్ చెరువు కూకట్పల్లి, చిన్నరాయుని చెరువు అల్వాల్, దుర్గం చెరువు, ఉప్పల్ నల్ల చెరువు, సున్నంచెరువుల పరిరక్షణపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉన్నప్పటికీ నెలల తరబడి పరిరక్షణలో జాప్యం చేస్తుండడం గమనార్హం.
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయా 13 చెరువుల పరిరక్షణలో .. టెక్నికల్ కన్సల్టెంట్‌గా నీరి (జాతీయ పర్యావరణ, ఇంజినీరింగ్ పరిశోధన సంస్థ)ని నియమించుకుని చెరువుల నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షలు జరపడంతో పాటు ఇరిగేషన్ సమన్వయంతో సంబంధిత చెరువుల అక్రమణకు గురి కాకుండా పక్కాగా పరిరక్షణ చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
ఇందుకోసం రూ. 55 లక్షల ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఎంఐఎం సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 13 చెరువులతో పాటు అదనంగా కొన్ని చెరువులను చేర్చాలని పట్టుపట్టారు. ఈ సమయంలో మేయర్‌కు, ఎంఐఎం సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. చివరకు ఈ ప్రతిపాదనను కమిటీ పక్కన పెట్టింది.