అబిడ్స్, సెప్టెంబర్ 4 : అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో రహదారులపై వర్షం నీరు నిల్వకుండా జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. మంగళవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురువడంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బందిని రంగంలోకి దింపి మ్యాన్హోళ్లపై చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జీహెచ్ఎంసీ – 14వ సర్కిల్ కార్యాలయం పరిధిలోని ముంపు ప్రాంతాలైన దారుసలాం, రంగమహల్ చౌరస్తా, ఎంజే మార్కెట్, బేగంబజార్, ఓల్డ్ పోలీస్స్టేషన్ ప్రాంతాల్లో వర్షం నీరు సాఫీగా పోయేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఉదయం నుంచి మ్యాన్హోళ్లపై చెత్త తొలగించడంతో పాటు నీరు సాఫీగా వెళ్లిపోయేలా ఏర్పాట్లు చేపట్టారు. మాన్సూన్ బృందాలతో పాటు స్టాటిక్ టీమ్లు రంగంలోని దిగి సహాయక చర్యలను చేపట్టాయి. జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ జోనల్ కమిషనర్ వెంకటేశ్ దోత్రే ఆదేశాల మేరకు ఎస్ఈ సహదేవ్ రత్నాకర్ నేతృత్వంలో ఇంజనీరింగ్ భాగం అధికారులు సహాయక చర్యలలో నిమగ్నమయ్యారు.
వర్షం నీరు రహదారులపై నిల్వకుండా జీహెచ్ఎంసీ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. వాతావరణ శాఖ వర్షాలు వస్తాయని ముందుగానే ప్రకటించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్తగా మాన్సూన్ బృందాలను అందుబాటులో ఉంచి సహాయక చర్యలు చేపట్టేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. స్టాటిక్ టీమ్ సిబ్బంది ముంపు ప్రాంతాల వద్ద అందుబాటులో ఉండి వర్షం నీరు నిలవకుండా చర్యలు చేపట్టారు.
అబిడ్స్, సెప్టెంబర్ 4 : వర్షా కాలం నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకుడు ఎం. ఆనంద్కుమార్గౌడ్ కోరారు. సోమవారం వర్షం కురువడంతో జాంబాగ్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలు చేపట్టారు. ఆనంద్కుమార్గౌడ్ మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితులు ఉంటే ఇంటి నుంచి బయటకు రావద్దని, వర్షం వస్తున్న నేపథ్యంలో విద్యుత్ స్తంభాలకు దూరంగా నడవాలని సూచించారు. వర్షాలతో రహదారులపై వర్షం నీరు నిల్వకుండా అవసరమైన చర్యలను అధికారులు చేపట్టాలని కోరారు. నాలాల్లో పూడికతీత పనులను చేపట్టాలని సూచించారు. కాల్వల గుండా వర్షం నీరు సాఫీగా పోయేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.