Property Tax | మియాపూర్, మార్చి 15 : ఆస్తి పన్ను బకాయిదారులపై కఠిన చర్యలకు జిహెచ్ఎంసి అధికారులు సిద్ధం అవుతున్నారు. పన్ను బకాయిల చెల్లింపుకై ఇప్పటికే ఓటిఎస్ను ప్రకటించిన నేపథ్యంలో బకాయిలన్నింటిని పూర్తిస్థాయిలో వసూలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వం ఈ అవకాశం కల్పించినప్పటికీ బకాయిలను చెల్లించని వ్యాపార వాణిజ్య సముదాయాలకు తాళం వేసే సీజ్ చేసే ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నారు.
శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని చందానగర్ సర్కిల్లో 75 మంది పెద్ద మొత్తంలో ఆస్తి పన్ను బకాయి పడ్డారు. ఇప్పటికే వారికి నోటీసులను జారీ చేశారు. నోటీసు గడువు సైతం తాజాగా ముగిసింది. ప్రభుత్వం ఓటిఎస్ను కల్పించినప్పటికీ ఇంకా బకాయిదారుల్లో చలనం రాకపోతుండడంతో సీజ్ మంత్రాన్ని అమలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. రూ.5 లక్షలకు పైగా ఆస్తిపన్ను బకాయిలు ఉన్నవారు చందానగర్ సర్కిల్ పరిధిలో సుమారు 75 వరకు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పన్ను బకాయిలను చెల్లించాలని ఇప్పటికే వారికి నోటీసులను జారీ చేశారు. ప్రభుత్వం ఓ టి ఎస్ సైతం ప్రకటించిందని వడ్డీ రాయితీని సద్వినియోగం చేసుకోవాలని నోటీసులలో స్పష్టం చేశారు. అయినప్పటికీ ఉండి బకాయి దారులలో చలనం రాకపోతుండడంతో , సోమవారం నుంచి సదరు వ్యాపార కేంద్రాలను సీజ్ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ తరహా పన్ను బకాయిదారుల జాబితాను సిద్ధం చేశారు.
ఇప్పటికే మాదాపూర్ డివిజన్ పరిధిలో రూ 24 లక్షలకు గాని వాణిజ్య భవనం పన్ను బకాయి ఉండడంతో నెల క్రితం సదురు భవనానికి అధికారులు తాళం వేశారు. ఓటిఎస్ ను ప్రకటించడంతో సదురు బకాయిదారు తన ఆస్తి పన్ను బకాయిని చెల్లించేందుకు సిద్ధం అయ్యారు. ఇదే తరహాలో మొండి బకాయిదారుల వ్యాపార వాణిజ్య కేంద్రాలను సీజ్ చేయడం ద్వారా తగిన గుణపాఠం నేర్పేందుకు చందానగర్ సర్కిల్ పన్ను విభాగం అధికారులు రంగం సిద్ధం చేశారు. అవసరమైతే ఆస్తులను జప్తు చేసి తమ పన్ను బకాయిలను వసూలు చేసుకునేందుకు వెనకాడబోమని అధికారులు పేర్కొంటున్నారు. మరో 15 రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో ఎలాగైనా 100% అస్తి పన్ను బకాయిలను వసూలు చేయాలని లక్ష్యంతో అధికారులు ఉన్నారు. సీజ్ మంత్రంతో తమ లక్ష్యం నెరవేరుతుందన్న గంపెడాశలతో అదికారులు ఎదురుచూస్తున్నారు.