అడ్డగుట్ట, ఏప్రిల్ 8: ముప్పై ఐదేండ్లకు పైబడి శిథిలావస్థకు చేరుకున్న ఓ ఇంటిని జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ సిబ్బంది కూల్చివేయడం వివాదానికి దారితీసింది. తాము ఉంటున్న ఇంటిని అకస్మాత్తుగా కూల్చేసి తమను రోడ్డున పడేశారని ఆ ఇంట్లో నివాసం ఉంటున్న రంజీ క్రీడాకారిణి శ్రావణి ఆరోపించగా అసలు ఆ ఇంటికి శ్రావణికి ఎలాంటి సంబంధం లేదని అసలు యజమానులం తామేనంటూ మరో ఇద్దరు స్పష్టం చేశారు. మరోవైపు ఇల్లు కూల్చివేయాల్సిన పరిస్థితి రావడంతోనే ముందస్తులు నోటీసులు ఇచ్చిన తర్వాతే ఆ పనిచేశామని టౌన్‌ప్లానింగ్ సిబ్బంది తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
సికింద్రాబాద్ నియోజకవర్గంలోని అడ్డగుట్ట డివిజన్లోని తుకారాంగేట్ వద్ద గడ్డమీది బస్తీలో 145 గజాల స్థలాన్ని సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన కె. సుదర్శన్ 1985 సంవత్సరంలో మీనా కుమారి అనే మహిళ దగ్గర నుంచి కోనుగోలు చేశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత తన చెల్లి కౌసల్యకు మల్లేశ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే కౌసల్య, మల్లేశ్ దంపతులకు అప్పుడు ఉండడానికి ఇల్లు లేకపోవడంతో గడ్డమీది బస్తీలోని తన ఇంటిని వాడుకోవాలని సుదర్శన్ వారికి చెప్పాడు. ఇదిలా ఉండగా 1993లో సుదర్శన్ మరణించాడు. ఆ తర్వాత అతని చెల్లి కౌసల్య కూడా 2016లో చనిపోవడంతో ఆమె భర్త మల్లేశ్, కూతురు శ్రావణి మాత్రమే ఆ ఇంట్లో ఉంటున్నారు. కాగా సుదర్శన్ కుమారులైన జానకీరామ్, శ్రీనివాస్‌లు తమ ఇంటిని ఖాళీ చేసి తమకు అప్పగించాల్సిందిగా గత కొన్నేండ్లుగా మేనత్త (కౌసల్య) కుటుంబంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎన్నిసార్లు విన్నవించినా వారు వినకపోవడంతో..తమ ఇల్లు శిథిలావస్థకు చేరుకున్నదని దాన్ని కూల్చేయాలని టౌన్‌ప్లానింగ్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో టౌన్ ప్లానింగ్ అధికారులు శ్రావణి కుటుంబ సభ్యులకు పలుమార్లు నోటీసులు జారీ చేసి ఈ నెల 6న ఇంటిని కూల్చివేశారు.
అది మా ఇల్లు…
మేము ఇద్దరం అన్నదమ్ములం. మాకు పళ్లు పిల్లలున్నారు. మాకు వేరే ప్రాంతాల్లో ఆస్తిపాస్తులు లేవు. గడ్డమీది బస్తీలోని ఆ ఇల్లే మా ఆస్తి. ఉన్న ఒక్క ఇల్లు ఆమెకు(శ్రావణికి) ఇచ్చేస్తే మా పరిస్థితి ఏమిటి? ఇంటి డాక్యుమెంట్లు అన్ని మా వద్ద ఉన్నాయి. కేవలం ఆ ఇంటిని వాడుకోమని మాత్రమే మా నాన్న మా మేనత్తకు చెప్పాడు. అంతే తప్ప ఆ ఇంటికి వాళ్లు యజమానులు కా దు. ఆ ఇల్లు ఖాళీ చేయాలని ఎన్నోసార్లు వాళ్లకు చెప్పాం. మేము శ్రావణి కుటుంబానికి అన్యాయం చేయాలనుకుంటే ఇన్నేండ్ల నుంచి ఎందుకు మౌనంగా ఉంటాం. ఇప్పటికీ శ్రావణికి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మాకు అన్యాయం చేయొద్దు. ఆ ఇల్లు మాది. – జానకీరామ్, శ్రీనివాస్ (ఇంటి యజమానులు)
మాకు గూడు కల్పించండి
30 ఏండ్లుగా గడ్డమీది బస్తీలోని ఈ ఇంట్లోనే ఉంటు న్నాం. 2016లో మా అమ్మ(కౌసల్య)చనిపోయినప్పటి నుండి ఆ ఇల్లు ఖాళీ చేయాలని మాపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. నేను పుట్టక ముందు నుండి ఇదే ఇంట్లో ఉంటున్నాం. ఉన్నట్టుండి ఇల్లు కూల్చివేసి రోడ్డున పడేస్తే ఎలా బతుకుతాం? మా నాన్న పని చేయలేడు. నేను రంజీ ప్లేయర్‌ను. నా కష్టం మీదనే కుటుంబం నడుస్తుంది. అధికారులు, ప్రభుత్వం స్పందించి మాకు ఏదైనా ప్రత్యామ్నాయం చూపించేంత వరకు స్థానికంగా ఉన్న అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లోనే ఉంటాం. ఎక్కడైనా గూడు కల్పించండి.
– భోగి శ్రావణి, రంజి క్రీడాకారిణి
నోటీసులు ఇచ్చి కూల్చాం…
గడ్డమీది బస్తీలోని ఇల్లు శిథిలావస్థకు చేరి కూలే స్థితిలో ఉందని మాకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఇంటిని కూల్చివేసేందుకు గాను తొలుత నోటీసు జారీ చేశాం. ఆ తర్వాత ప్రాథమికంగా ఇంజనీరింగ్ అధికారులను అక్కడి పంపించి..వారు ఆ ఇంటిని కూల్చేయాల్సిన అవసరం ఉందని చెప్పిన తర్వాతే తుది నోటీసు ఇచ్చి కూల్చేశాం.
– యమున, టౌన్‌ప్లానింగ్ సెక్షన్ అధికారి