GHMC | ముషీరాబాద్, మే 25 : బస్తీ ప్రధాన కూడళ్లలో మళ్లీ డస్ట్బిన్లు ప్రత్యక్షమవుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడళ్లలోని చెత్తకుప్పలు, డస్ట్ బిన్లను తొలగించి డస్ట్ బిన్ ఫ్రీ సిటీగా మారిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ డస్ట్బిన్లను ఏర్పాటు చేస్తున్నారు. కూడళ్లలో డస్ట్బిన్లను ఏర్పాటు చేయడం వల్ల అక్కడ ఇష్టమొచ్చినట్లుగా చెత్త పడేసి వెళ్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున చెత్త పేరుకుపోతుంది.
గతంలో హైదరాబాద్ మహానగరాన్ని డస్ట్ బిన్ ఫ్రీ సిటీగా చేయడానికి జీహెచ్ఎంసీ అధికారులు వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా ఇంటింటికీ వెళ్లి చెత్తనే సేకరించారు. అనంతరం కూడళ్లలో డంపింగ్ పాయింట్లను తీసేశారు. డస్ట్ బిన్లను తొలగించి అయా ప్రాంతాలను శుభ్రం చేసి, ఆ ప్రాంతాల్లో ముగ్గులు వేసి, చెత్త రహిత ప్రాంతాలుగా మైక్ల్లో ప్రచారం చేసి బస్తీలు, కాలనీలను చెత్త రహిత కాలనీలుగా తీర్చిదిద్దారు. ఇటీవల జీహెచ్ఎంసీ మళ్లీ డస్ట్ బిన్ లు ఏర్పాటు చేయడం వల్ల పారిశుద్ధ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇంతవరకు చెత్త రహిత ప్రాంతాలుగా ఉన్న బస్తీలో మళ్లీ పారిశుద్ధ్య సమస్య కనిపిస్తుంది. డస్ట్ బిన్లు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు ఇష్టం వచ్చినట్లు చెత్తబడిచేస్తున్నారు. ఆటోరిక్షాలు, రిక్షాలకు వేయాల్సిన చెత్త డస్ట్ బిన్లలో పడవేస్తున్నారు. ఇటీవల జీహెచ్ఎంసీ డస్ట్ బిన్ల కొనుగోలు చేసి పలుబస్తీలో ఏర్పాటు చేసింది. దీనివల్ల పారిశుధ్య సమస్యలు ఏర్పడుతున్నాయి.