GHMC | సిటీబ్యూరో: అకాలవర్షం గ్రేటర్ జనజీవనాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. నాలాల పూడికతీత నిర్లక్ష్యంతో లోతట్టు ప్రాంతాలను వరద నీటితో ముంచెత్తింది. ఇందుకు జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగమే ప్రధాన కారణం. జనవరిలో మొదలు కావాల్సిన నాలా పూడికతీత పనులను మార్చి నెల ముగిసినా టెండర్ల ప్రక్రియను పూర్తి చేయలేకపోయారు. ఈ ఏడాదిలో రూ.55 కోట్లతో 203 చోట్ల పనులు చేపడుతున్నామని, 120 చోట్ల పూడిక తీత పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. మిగిలిన 83 చోట్ల పనులను టెండర్ల ప్రక్రియ ముగింపులో ఉందని, త్వరలోనే ఈ పనులు మొదలు పెడతామని ఇటీవల అధికారులు చెప్పారు. అరగంట పాటు ఏకధాటిగా కురిసిన 9 సెంటీ మీటర్ల వర్షంతో జీహెచ్ఎంసీ కంట్రోల్ రూంకు ఫిర్యాదులు పోటెత్తాయి. జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి శుక్రవారం అధికారులతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. హెచ్ఎండీఏ అధికారుల నిర్లక్ష్యంతో బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ, లోటస్ ఫాండ్ నుంచి వర్షపు వరద ప్రవాహం వచ్చిందని, హకీంపేట నుండ బల్కం చెరువులోకి వరద నీరు సాఫీగా వెళ్లడం లేదని, లే అవుట్ కారణంగా మట్టితో కూడిన వరద రావడంతో సమస్య తలెత్తిందని అధికారులు కమిషనర్‌కు వివరించారు.
అకాలవర్షంతో ఆగమాగమైన హైదరాబాద్ నగరంలో ఇంకా కరెంట్ బాధలు తీరలేదు. ప్రధానంగా మీరాలంమండిలో గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు సుమారుగా 20 గంటలు కరెంట్ లేదని ఒక వినియోగదారుడు కాంప్లైంట్ చేయగా, ఖలందర్నగర్లో ఎనిమిది గంటల పాటు కరెంట్ పోతే.. తిరిగి శుక్రవారం కూడా అదే పరిస్థితి నెలకొందని మరో వినియోగదారుడు ఫిర్యాదు చేశారు. మరోవైపు మదీనా మార్కెట్, పతేర్ఘటిలో శుక్రవారం సాయంత్రం 6గంటల వరకు విద్యుత్ పునరుద్ధరణ జరగలేదని మరో వినియోగదారుడు ఫిర్యాదు చేశారు. వర్షానికి గ్రేటర్లో 57 పోల్స్, 44 డీటీఆర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. కాగా, విధుల్లో నిర్లక్ష్యం వహించిన సాలార్జంగ్ సబ్‌స్టేషన్ ఆపరేటర్‌ను ఎస్పీడీసీఎల్ సీఎండీ సస్పెండ్ చేశారు.
ఖైరతాబాద్: తుమ్మలబస్తీలోని బల్కాపూర్ నాలా వ్యర్థాలతో నిండిపోవడంతో గురువారం కురిసిన వర్షానికి ఉప్పొంగింది. నిర్వహణ లేకపోవడంతో గతేడాది సైతం భారీగా వ్యర్థాలు పేరుకుపోయి ముంపునకు గురైంది. గతంలో ఇదే నాలాలో ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర వస్తువులు ఏరుకునేందుకు వెళ్లిన ఓ యువకుడు వ్యర్థాల్లో ఇరుక్కుపోయి మృత్యువాతపడ్డాడు. కాగా, బల్కాపూర్ నాలాకు ఓ వైపు వేసిన ఫెన్సింగ్ ఎక్కడికక్కడే ఊడిపోయింది. నాలాలో నిత్యం వ్యర్థాలు తొలగిస్తేనే అక్కడ వరదను నివారించే అవకాశం ఉంటుంది. ఆలస్యంగానైనా సర్కిల్ పరిధిలో నాలాల డీసిల్టింగ్‌ను ప్రారంభించగా, గురువారం కురిసిన భారీ వర్షానికి బల్కాపూర్ నాలాలో దిగిన ఎక్స్కవేటర్ వ్యర్థాల్లో కూరుకుపోయి దెబ్బతిన్నది.
సర్కిల్ -17 పరిధిలో ఇంజినీరింగ్ విభాగంలో కొందరు అధికారులు బదిలీలు పొందకుండా ఏండ్ల తరబడి లాంగ్ స్టాండింగ్‌లో ఉంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరి నిర్లక్ష్యం వల్లే నాలాల నిర్వహణ లేక వరద ముంపు ముంచుకొస్తున్నదని పలువురు ఆరోపిస్తున్నారు.