మెహిదీపట్నం /కార్వాన్/చాంద్రాయణగుట్ట, జూలై 20 : ప్రజలకు వర్షాల కారణంగా ఇబ్బందులు కలుగకుండా జీహెచ్ఎంసీ అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్‌మొహినుద్దీన్ అధికారులను ఆదేశించారు. గురువారం వర్షాల కారణంగా నీటితో నిండిన రోడ్లను, చౌరస్తాలను. ఆదే విధంగా శాతం చెరువు ప్రాంతాన్ని ఎమ్మెల్యే జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులతో కలిసి పరిశీలించారు. టోలిచౌకి, నానల్‌నగర్, గోల్కొండ,ంగర్హౌస్ డివిజన్లలోని లోతట్టు ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా వర్షం నీరు సక్రమంగా పోయేలా అధికారులు ప్రధాన రోడ్లపై చర్యలు చేపట్టాలని సూచించారు. టోలిచౌకి శాతం చెరువులో ఉంచి కిందకు నీరు వేగంగా పోయేలా చర్యలు తీసుకోవాలని, ఎమర్జన్సీ బృందాలను ప్రజలకు అందుబాటులో పెట్టాలని ఎమ్మెల్యే కౌసర్‌మొహినుద్దీన్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నానల్‌నగర్ కార్పొరేటర్ ఎండీ నసీరుద్దీన్, ఎంఐఎం కార్పొరేటర్ల ప్రతినిధులు మహ్మద్ హరూన్ ఫర్హాన్, బద్రుద్దీన్, వజీ ఉజ్జమాసిద్ధికీ, ఈఈ వెంకటశేషయ్య, డీజీఎం జవహర్ అలీ తదితరులు పాల్గొన్నారు.
నాంపల్లి నియోజకవర్గం మల్లేపల్లి డివిజన్లో వర్షం నీరు ఎప్పటికప్పుడు పోయేందుకు జీహెచ్ఎంసీ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా గురువారం జీహెచ్ఎంసీ సర్కిల్-12 ఇంజినీరింగ్ ఈఈ లాల్‌సింగ్, డిప్యూటీ ఈఈ శ్రీనివాస్, ఎఈ మహేశ్, ఎంఐఎం కార్పొరేటర్ ప్రతినిధి జాఫర్ఖాన్లు మల్లేపల్లిలో పర్యటించారు. ఎండతెరిపిలేని వర్షానికి పాతబస్తీ ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. అధికారుల సూచన మేరకు అత్యవసరం అయితే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావడం లేదు. కొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా వర్షం కురుస్తే మరికొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షం కురుస్తోందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. రెండు రోజలుగా వర్షం ఊపందుకోవడంతో రెండు రోజల పాటు పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. రోజుకూలీ చేసుకునే వారు ఇబ్బందులు పడుతున్నారు. లాల్‌దర్వాజ మోడ్‌పై అడ్డా కూలీలు వర్షంలో సైతం పని కోసం వేచి ఉన్నారు. ప్రధాన రోడ్డు మార్గాలలో దుకాణాలు తెరుచుకోలేదు. బోనాలు, ఘటాల ఊరేగింపు పండుగలతో బిజీగా ఉన్న పాతబస్తీ ప్రజలకు వర్షం కారణంగా కొంత నిరవధికంగా సెలవులు ప్రకటించినట్లు ఐనది. కచ్చామోరీలు, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్న ప్రాంతాల్లో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లు పని చేస్తున్నాయి.
అవసరమైన చోట డీఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధంగా ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే పాత భవనాలు, శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో జనం నివాసం ఉండవొద్దని మున్సిపల్ అధికారులు జనంను కోరడం జరిగింది. అవసరమైతే మా సహాయం ఉంటుందని కూడా స్పష్టం చేశారు. మున్సిపల్ ప్రధాన కంట్రోల్ రూంకు వచ్చిన ఫోన్ల ఆధారంగా సౌత్‌జోన్ సిబ్బంది ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెంటనే వెళ్లి పరిష్కారం చూపుతున్నారు. దక్షిణ మండలం పరిధిలో ఇప్పటికే 36 మాన్సూన్ టీంలు పని చేస్తున్నట్లు జోనల్ కమిషనర్ టి. వెంకన్న తెలిపారు. ఒక్కో టీంలో నలుగురు సిబ్బంది ఉన్నట్లు స్పష్టం చేశారు. ప్రజల జీవన విధానికి ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఏదైనా సమస్య తలెత్తుతే మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.
సోమవారం రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షంతో కార్వాన్, గుడిమల్కాపూర్లలోని ప్రధాన రోడ్లన్నీ జలమయంగా మారాయి. గుడిమల్కాపూర్ శివ్‌బాగ్ చౌరస్తా నుంచి కూరగాయల మార్కెట్ వరకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. చెరువును తలపిస్తున్న ఈ రోడ్డులో ప్రజలు ఆపసోపాలు పడుతూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే పరిస్థితి కార్వాన్ మొఘల్ కా నాలా ప్రధాన రోడ్డులో కూడా ఏర్పడింది. అదే విధంగా కుల్సుంపురా పాఠశాల ప్రధాన రోడ్లలో వర్షపు నీరు ప్రవహిస్తుండడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు . వర్షం భారీగా పడుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం విద్యా సంస్థలకు రెండు రోజులు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో గురువారం ఉదయం ఈ విషయం తెలియని విద్యార్థులు పాఠశాలకు చేరుకొని తిరుగుముఖం పట్టారు.