సిటీబ్యూరో, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం వికేంద్రీకరణలో సర్కారు అడుగులపై అనేక ప్రశ్నలు, ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. గందరగోళం నడుమ విలీన ప్రక్రియను పూర్తి చేసి జోన్లకు కేటాయించడంపై శివారు మున్పిపాలిటీల్లోని అన్ని వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వారం రోజులుగా ఆందోళన జరుగుతున్నా స్థానికంగా వచ్చిన ప్రశ్నలపై నివృత్తి చేయని జీహెచ్ఎంసీ.. తాజాగా వార్డుల డీలిమిటేషన్ (పునర్విభజన)పై బుధవారం నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించేందుకు మంగళవారం జీహెచ్ఎంసీ కమిషనర్ డీలిమిటేషన్‌పై ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు.
జీవో నం 570 ప్రకారంగా జీహెచ్ఎంసీ ప్రాంతాన్ని 300 ఎన్నికల వార్డులుగా విభజించినట్లు ప్రకటించారు. సరిహద్దు విస్తరణ వివరాలను అన్ని సర్కిల్ కార్యాలయాలు, జోనల్, ప్రధాన కార్యాలయాల భవనాల నోటీసు బోర్డులపై ఉంచినట్లు పేర్కొన్నారు. వివరాలు జీహెచ్ఎంసీ వెబ్సైట్ www.ghmc.gov.inలో అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ప్రజలు ఏవైనా సూచనలు, లేదా అభ్యంతరాలు ఉంటే ఏడు రోజుల్లోగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయాలను సంప్రదించాలని సూచించారు.
వార్డుల పునర్విభజనలో అనేక సందేహాలు..
జీహెచ్ఎంసీలో ఇప్పటి వరకు ఉన్న ఆరు జోన్లను పది జోన్ల పెంచి విభజించినట్లు తెలుస్తున్నది. ఒక్కో జోన్‌కు 30 వార్డుల చొప్పున, 50 సర్కిళ్లకుగాను మొత్తం 300 వార్డులు విభజించారు. కీసర తొలి డివిజన్‌గా 300వ డివిజన్‌గా తూంకుంటతో ముగించారు. వార్డుకు 40వేల నుంచి 50వేల జనాభా చొప్పున 300 డివిజన్లను ఖరారు చేశారు. కొన్ని డివిజన్లలో భౌగోళికంగా విస్తీర్ణం పెద్దగా ఉండి..జనాభా తక్కువగా ఉన్న కొత్త డివిజన్‌గా ఖరారు చేశారు. మొత్తానికి సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెన్స్, జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో 10 రోజులుగా డీలిమిటేషన్ ప్రక్రియను హడావుడిగా పూర్తి చేసి చివరి ఘట్టమైన అభ్యంతరాలపై తక్కువ సమయంలో ప్రజల ముందు పెట్టడం విశేషం.
ప్రజాభిప్రాయానికి విలువేదీ..?
విలీనంలోనే అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న వేళ శాస్త్రీయత లేకుండా 300 డివిజన్లు ఖరారు చేసి ఈ వార్డుల పునర్విభజనపై అభ్యంతరాలు, సలహాలను స్వీకరించే క్రమంలోను ప్రజాభిప్రాయాలకు ఏ మాత్రం గౌరవం ఇవ్వలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హడావిడిగా డివిజన్లను ఖరారు చేయడమే కాకుండా వారం వ్యవధిలోనే ప్రక్రియను పూర్తి చేసేందుకు సిద్ధమైన తీరుపై అనుమానాలు లేక పోలేదు. ప్రభుత్వం ముందుగానే విలీనం, వికేంద్రీకరణపై సీజీజీ (సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్) వేదికగా ముగించి మొక్కుబడిగా ప్రజల ముందుకు ప్రతిపాదనలు తీసుకురావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డివిజన్ల ఖరారులో నాలుగు వైపులా (నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్) అంటూ సర్వే నంబర్లు, బౌండరీలను ఫిక్స్ చేసి ప్రజల ముందు ఉంచారు. జీహెచ్ఎంసీ వెబ్సైట్లో మ్యాప్‌లను పొందుపర్చకపోవడం గమనార్హం.
అభ్యంతరాలపై చలో జీహెచ్ఎంసీ..
వార్డుల పునర్విభజనపై మాన్యువల్ గా, లిఖితపూర్వకంగా మాత్రమే స్వీకరిస్తారు. అంతేకాకుండా, ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సలహాలపై మరింత లోతుగా చర్చించడానికి, వాటిని పరిశీలించడానికి తక్కువ సమయంలోనే అధికారులు ఎలా పూర్తి చేస్తారన్నది ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న. రాబోయే 10 రోజుల్లో ప్రత్యేకంగా కౌన్సిల్ సమావేశం నిర్వహించి, కౌన్సిల్లో ఆమోదముద్ర వేసుకుని చకచకా ప్రభుత్వం నుంచి ఫైనల్ గెజిట్ విడుదల చేసేలా మాస్టర్ ప్లాన్ ఖరారు చేయడం వెనుక మతలబులెన్నో ఉన్నాయన్న చర్చ జరగుతున్నది. కాగా ప్రస్తుత పాలక మండలి గడువు ముగింపు ఫిబ్రవరి 11 తర్వాత జీహెచ్ఎంసీని ఒక కార్పొరేషన్ చేస్తారా ? ముక్కలుగా విభజిస్తారా అన్నది తేలాల్సి ఉంటుంది. లేదంటే వార్డు పునర్విభజన పూర్తికాగానే రిజర్వేషన్లు ప్రకటించి ఎన్నికలు వెళ్తారా? అన్నది చర్చ లేకపోలేదు.