బంజారాహిల్స్, మార్చి 11: మహిళా గవర్నర్ అయ్యి ఉండి రాజ్‌భవన్‌లోకి మహిళా ప్రజాప్రతినిధులకే అనుమతి ఇవ్వకపోవడం విడ్డూరం. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసేందుకు శనివారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు, మహిళా నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున రాజ్‌భవన్‌కు చేరుకున్నారు.
అయితే అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. గేట్‌కు తాళం వేసి రాజ్‌భవన్‌లోనికి వెళ్లకుండా నిలువరించారు. ఉదయం నుంచి గవర్నర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నామని.. కేవలం వినతిపత్రం ఇచ్చి వెళ్తామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పోలీసులతో మొర పెట్టుకున్నా వారు వినిపించుకోలేదు. దీంతో మహిళా నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహిళా గవర్నర్ అయి ఉండి, రాజ్‌భవన్‌లోకి మహిళలను అనుమతించకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళా ప్రజాప్రతినిధిపై బీజేపీ అధ్యక్షుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తే గవర్నర్ స్పందించకపోవడం విడ్డూరమన్నారు.
రోడ్డుపై బైఠాయించి నిరసన..
గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు మేయర్ బృందం రాజ్‌భవన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రాజ్‌భవన్ ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సుమారు అరగంట పాటు మహిళా ప్రజాప్రతినిధులు అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. బండి సంజయ్‌కు వ్యతిరేకంగా నినదించారు. ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే రాజ్‌భవన్ వర్గాల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వినతిపత్రాలను రాజ్‌భవన్ గోడలకు అంటించారు.