BJP | సిటీబ్యూరో, మే 3 (నమస్తే తెలంగాణ): మొన్న జీహెచ్ఎంసీ కార్యాలయం.. నిన్న జలమండలి కార్యాలయం.. తాజాగా గ్రేటర్ సర్వసభ్య సమావేశం.. వేదిక ఏదైనా సరే.. బీజేపీ కార్పొరేటర్లదీ ఒకటే వీరంగం. ప్రజాసమస్యలు గాలికొదిలేసి.. రాజకీయ లబ్ధి కోసం నానా రభస చేస్తున్నారు. హోదాలు, బాధ్యతలు మరిచి బరితెగించి ప్రవర్తిస్తున్నారు. పరిష్కార వేదికలపైనే అసభ్య పదజాలం వినియోగిస్తూ అధికారులను దూషిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. చర్చకు రమ్మని మేయర్ ఎంత కోరినా.. రచ్చ చేయడానికే మొగ్గు చూపుతున్నారు. బీజేపీ కార్పొరేటర్ల గూండాగిరితో బుధవారం జరిగిన సర్వసభ్య సమావేశం కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే అర్ధంతరంగా ముగిసింది. అయినా కాషాయ నేతలు కమిషనర్ చాంబర్లో సాయంత్రం వరకు గొడవ చేశారు. బీజేపీ నేతల తీరును ప్రతిపక్ష పార్టీ నేతలు ఖండించగా, అధికారులు కౌన్సిల్‌ను బాయ్‌కాట్ చేశారు. బీజేపీ కార్పొరేటర్లు అధికారులకు క్షమాపణలు చెప్పాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
ఎలుక తోలు తెచ్చి ఎంత ఉతికినా.. నలుపు నలుపేగానీ తెలుపు కాదు! అవును..గ్రేటర్ హైదరాబాద్‌లోని బీజేపీ కార్పొరేటర్ల తీరు కూడా ఇంతే! తమ సమస్యలు పరిష్కరిస్తారనే కొండంత ఆశతో జనం వీళ్లకు ఓట్లేస్తే..పరిష్కార వేదికలపై వీరంగం ఆడుతున్నారు. హోదాలు మరిచి… ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. చివరకు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను సైతం వదలడం లేదు. పౌరులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా కష్టపడి పనిచేస్తున్న అధికారులను భయబ్రాంతులకు గురి చేసేలా వ్యవహరిస్తున్నారు. కౌన్సిల్ వేదికగా అన్ పార్లమెంటరీ పదాలతో అధికారులపై ఇష్టమైన రీతిలో తిట్టడం మొదలు.. ఉద్యోగులను అవమానన పరిచే విధంగా చాంబర్ల ముందు సిల్ట్ వేస్తూ నానా రభస చేస్తున్నారు… మొన్న జీహెచ్ఎంసీ కార్యాలయం..నిన్న జలమండలి కార్యాలయం..తాజాగా గ్రేటర్ సర్వసభ్య సమావేశం..వేదిక ఏదైనా సరే బీజేపీ కార్పొరేటర్లు ఏ క్షణంలో ఎలా వ్యవహరిస్తారోనంటూ అటు అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు తలపట్టుకొని కూర్చుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలోనూ బీజేపీ కార్పొరేటర్ల గుండాగిరి కొనసాగింది. 150 మంది ఉన్న కౌన్సిల్ సభలో ప్రజా సమస్యలపై అన్ని పార్టీల నేతలకు మాట్లాడే అవకాశాన్ని మేయర్ కల్పించారు. సభ మధ్యాహ్నం 12.33 గంటలకు ప్రారంభం కాగా..తొలుత సంతాప తీర్మానాలు..ఆ తర్వాత మేయర్ ప్రసంగం..తదనంతరం భోజన విరామం ఆనంతరం ప్రశ్నోత్తరాలపై సుదీర్ఘంగా చర్చిద్దామని మేయర్ విన్నవించారు. ఇక్కడే బీజేపీ కార్పొరేటర్లు తమ రాజకీయ లబ్ధి ప్రదర్శనను మరోమారు ప్రదర్శించారు. మేయర్ సీట్లో కూర్చొమని బీజేపీ కార్పొరేటర్లను పలుమార్లు కోరినా వినకపోగా.. వారు ఆందోళన చేపట్టారు.
అధికారులు ఎలా బైకాట్ చేస్తారంటూ తొలుత మేయర్ పోడియం చుట్టు ముట్టారు. చివరకు మేయర్ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సభ కేవలం 20 నిమిషాలు మాత్రమే జరిగి అర్ధంతరంగా ముగిసింది. ఆ తర్వాత కమిషనర్ చాంబర్లో సాయంత్రం వరకు గొడవ సృష్టించారు. మేయర్ పరిధిలో ఉన్న అంశమని తరచూ కమిషనర్ లోకేశ్‌కుమార్, ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్‌రెడ్డి సర్దిచెప్పినా వినలేదు. చివరకు సాయంత్రం ఆరు గంటల సమయంలో పోలీసులు జోక్యం చేసుకుని బీజేపీ కార్పొరేటర్లను అదుపులోకి తీసుకుని జీహెచ్ఎంసీ కార్యాలయం నుంచి బయటకు పంపించారు. బీజేపీ కార్పొరేటర్లు వ్యవహరించిన తీరును ప్రతిపక్ష పార్టీలు ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు సైతం తీవ్రంగా ఖండించారు. కాగా మొత్తంగా జీహెచ్ఎంసీ చరిత్రలోనే అధికారులు కౌన్సిల్‌ను బైకాట్ చేయడం..ఇందుకు బీజేపీ కార్పొరేటర్లు కారణం కావడం చర్చనీయాంశమైంది.
బీజేపీ కార్పొరేటర్ల తీరు సరికాదు: మేయర్
జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు వ్యవహరించిన తీరు సరికాదని మేయర్ విజయలక్ష్మి పేర్కొన్నారు. సభ్యుల కోరిక మేరకే కౌన్సిల్ సమావేశం ఆలస్యంగా నిర్వహించాన్నారు. జీహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశం వాయిదా వేసిన తర్వాత తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ ప్రతిపక్ష కార్పొరేటర్లపై విరుచుకుపడ్డారు. చాలా బాధాకరమైన రోజు అని సమావేశం సజావుగా సాగేందుకు అన్ని పార్టీ నేతలతో మాట్లాడినట్లు వివరించారు. ప్రజా సమస్యల పరిషారం కోసం కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశామని, బీజేపీ కార్పొరేటర్లు ఉద్దేశ పూర్వకంగా నిరసనకు దిగారని మేయర్ తెలిపారు. కొందరు బీజేపీ కార్పొరేటర్లు అధికారులను అన్ పార్లమెంటరీ వర్డ్స్ వాడారని మేయర్ పేర్కొన్నారు. మంగళవారం జలమండలి కార్యాలయంలో మహిళా అధికారి, మేనేజింగ్ డైరెక్టర్ చాంబర్లో పూడిక తీసిన మట్టిని వేయడం సరికాదని మేయర్ పేర్కొన్నారు. ఇకనైనా బీజేపీ కార్పొరేటర్లు ప్రవర్తన మార్చుకొని సమావేశం సజావుగా సాగేందుకు సహకరించాలని మేయర్ కోరారు.
అధికారులతో మర్యాదగా ప్రవర్తించాలి
తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు, జోనల్ కమిషనర్ మమత కార్పొరేటర్లు అధికారులతో మర్యాదగా ప్రవర్తించాలని, లేని పక్షంలో అధికారులు సహకరించమని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ మమత అన్నారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం బైకాట్ చేసిన సందర్భంగా ఆమె మాట్లాడారు. బీజేపీ కార్పొరేటర్లు అధికారుల పట్ల అనుచిత ధోరణికి నిరసనగా కౌన్సిల్ సమావేశం బైకాట్ చేసినట్లు తెలిపారు. మంగళవారం జలమండలి కార్యాలయం వద్ద బీజేపీ కార్పొరేటర్లు ఎటువంటి సంసారం పద్ధతి లేకుండా అధికారుల కార్యాలయం చాంబర్లో సిల్ట్ వేయడం అధికారులపై అనుచితంగా మాట్లాడటంపై జీహెచ్ఎంసీ అధికారులు ఖండిస్తున్నట్లు ప్రకటిస్తూ జలమండలి అధికారులకు మద్దతుగా కౌన్సిల్ సమావేశం బైకాట్ చేసినట్లు చెప్పారు. ఉద్యోగులను అవమానన పరిచే విధంగా జనరల్ బాడీలో మాట్లాడటం ఖండిస్తున్నామని మమత పేర్కొన్నారు. ఇకనుంచైనా కార్పొరేటర్లు అధికారులతో మర్యాదగా ప్రవర్తించాలని మమత కోరారు.
అధికారులతో వ్యవహరించిన తీరు సరైంది కాదు: జలమండలి ఈడీ సత్యనారాయణ
జలమండలి కార్యాలయంలో మంగళవారం బీజేపీ కార్పొరేటర్లు సిల్ట్ వేయడం, అధికారులపై అనుచితంగా ప్రవర్తించిన కారణంగా కౌన్సిల్ సమావేశాన్ని బైకాట్ చేసినట్లు జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎం.సత్యనారాయణ తెలిపారు. కౌన్సిల్ సమావేశంలో ఈడీ సత్యనారాయణ మట్లాడారు. జలమండలి ద్వారా తాగునీరు, మురుగు నీటి సమస్యలను కార్పొరేటర్ల సహకారంతో పరిష్కరిస్తున్నామని చెప్పారు. పని చేస్తున్న అధికారులను గుర్తించకపోగా..వారిని అవమానించే రీతిలో అధికారుల చాంబర్లో సిల్ట్ వేశారన్నారు. అధికారులతో అనుచితంగా ప్రవర్తించినందుకు కౌన్సిల్ సమావేశాన్ని వాక్ ఔట్ చేస్తున్నట్లు ప్రకటించినట్లు ఈడీ సత్యనారాయణ తెలిపారు.