Gadwal Vijayalakshmi | సిటీబ్యూరో, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ ): చదువుకున్న వాళ్లే రహదారులపై చెత్త వేస్తున్నారని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ చెత్త వేసే ప్రాంతాల(జీవీపీ)ను ఉదయం శుభ్రం చేసినా.. సాయంత్రం వరకు మళ్లీ వ్యర్థాలు పేరుకుపోతున్నాయన్నారు. చదువుకున్న వారే రహదారులపై చెత్త వేస్తున్నారని మేయర్ పేర్కొన్నారు. సోమవారం ఎన్బీటీనగర్లో ‘స్వచ్ఛదనం – పచ్చదనం’ కార్యక్రమాన్ని కమిషనర్ ఆమ్రపాలి, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతితో కలిసి ప్రారంభించారు.
అనంతరం మేయర్ మాట్లాడుతూ గ్రేటర్లో పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని, ప్రజలు సహకరించాలని కోరారు. స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికతో ముందుకెళ్తున్నామన్నారు. గ్రేటర్లో 4 వేలకు పైగా స్వచ్ఛ ఆటోల ద్వారా చెత్త సేకరణ జరిగినా.. ఇంకా వ్యర్థాలను బయట వేస్తున్నారన్నారు. గ్రేటర్లో పచ్చదనం, పరిశుభ్రత పెంచేందుకు 5 రోజుల పాటు సుందరీకరణతో పాటు పరిశుభ్రత పనులు చేపడుతున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. కుకల నుంచి జాగ్రత్తగా ఉండాలని, చిన్న పిల్లలను తల్లిదండ్రులు ఒంటరిగా బయటకు పంపొద్దని సూచించారు. కుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ప్రతి ఒకరూ నగరాన్ని శుభ్రంగా ఉంచాలని, రోడ్డుపై చెత్త వేయొద్దని ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి కోరారు. ఖైరతాబాద్ పరిధిలో 700 స్వచ్ఛ ఆటోలు ఇంటింటి నుంచి చెత్తను సేకరిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒకరూ స్వచ్ఛ ఆటోలకే వ్యర్థాలను అందజేయాలన్నారు. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు 24×7 సిబ్బందితో పాటు అవసరమైన వాహనాలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి, చీఫ్ ఎంటమాలజీ డాక్టర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అలాగే శంషాబాద్ మండలం పెద్దగోల్కొండ, శంకరాపూర్ గ్రామాల్లో నిర్వహించిన ‘స్వచ్ఛదనం- పచ్చదనం’లో పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కుమార్ భాగస్వాములయ్యారు. గ్రామస్తులతో కలిసి ర్యాలీ తీశారు.
కాచిగూడలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పచ్చదనం-పరిశుభ్రత’ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ చెత్తను ఊడ్చి.. ట్రాలీలో వేశారు. కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి ఒడ్డెన్న, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్ తదితరులు పాల్గొన్నారు.