జూబ్లీహిల్స్/ఎర్రగడ్డ,జనవరి23: కంటి వెలుగు శిబిరాల్లో ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ ఉమా ప్రకాశ్ పేర్కొన్నారు. యూసుఫ్‌గూడ సర్కిల్లో సోమవారం రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని ఫాతిమానగర్ కంటి వెలుగు కేంద్రంలో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకుని గంటకు పైగా పరీక్షల కోసం వేచి ఉన్నామని.. భోజనం చేస్తున్న కారణంగా సిబ్బంది తలుపులు వేసి ఉంచారని శిబిరానికి హాజరైన ప్రజలు చెప్పడంతో లంచ్ టైమ్‌లో విరామం ఇవ్వకుండా రొటేషన్ పద్ధతిలో విధులు నిర్వర్తించాలని సూచించారు. పరీక్షలు వేగంగా చేపట్టేందుకు ట్యాబ్‌లతో పాటు అవసరమైనన్ని పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆయా కేంద్రాలలో అవసరమైనన్ని కుర్చీలు, టెంట్లు, తాగునీరు ఏర్పాటుచేయాలని సిబ్బందికి సూచించారు. కంటి వెలుగును వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఎంఓహెచ్ డాక్టర్ బిందు భార్గవి, శానిటరీ ఇన్స్పెక్టర్ విజయ్‌కుమార్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విప్లవ పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్,జనవరి23: యూసుఫ్‌గూడ సర్కిల్లో మూడో రోజు 869 మందికి పరీక్షలు నిర్వహించినట్లు డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ రమేశ్ తెలిపారు. యూసుఫ్‌గూడలోని వెంకటగిరి కమ్యూనిటీ హాలులో 101 మందికి, వెంగళరావునగర్ డివిజన్ మధురానగర్ కమ్యూనిటీ హాలులో 200 మందికి, ఎర్రగడ్డ ఫాతిమానగర్ కమ్యూనిటీ హాలులో 161 మందికి, రహ్మత్‌నగర్ డివిజన్ కార్మికనగర్ కమ్యూనిటీ హాలులో 140 మందికి, బోరబండ బంజారానగర్ కమ్యూనిటీ హాలులో 267 మందికి పరీక్షలు నిర్వహించారు. ఆయా శిబిరాలలో అవసరమైన వారికి కండ్లద్దాలు, మందులు పంపిణీ చేశారు. మూడు రోజుల్లో ఆయా శిబిరాలలో 2233 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
బన్సీలాల్‌పేట్, జనవరి 23 : పద్మారావునగర్‌లోని హమాలీబస్తీలో ఉన్న బస్తీ దవాఖాన వద్ద, న్యూబోయిగూడలోని కీస్ బ్లాక్స్ కమ్యూనిటీ హాలులో ‘కంటి వెలుగు’ శిబిరాలను జీహెచ్ఎంసీ బేగంపేట్ సర్కిల్ సహాయ కమిషనర్ దయానంద్ సోమవారం సందర్శించారు. అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. పేద ప్రజల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండోవిడుత ‘కంటి వెలుగు’ శిబిరాలను అన్ని బస్తీలకు చెందిన ప్రజలు సందర్శించి, కంటి పరీక్షలు చేయించుకుంటున్నారని ఆయన అన్నారు. క్యాంపు ఇన్చార్జి డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ మౌనిక, డాక్టర్ సుమధుర హాసిని, డాక్టర్ రవికుమార్ తమ సిబ్బందితో కలసి నమోదు, కంటి చూపు, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించి, అక్కడికక్కడే కంటి అద్దాలను అందజేశారు. అవసరమున్న వారికి శస్త్ర చికిత్సకు సిఫారసు చేశామని వారు తెలిపారు.
అమీర్‌పేట్, జనవరి 23: ప్రతి ఒక్కరికీ ఉచితంగా కంటి వైద్య పరీక్షలు చేయాలన్న ప్రభుత్వ సంకల్పం పేదలకు వరంగా మారిందని మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి అన్నారు. అమీర్‌పేట్ డివిజన్లో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాన్ని సోమవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ఉచితంగా కంటి చూపు పరీక్షలు నిర్వహించడమే కాక అవసరమైన వారికి కంటి అద్దాలు, మందులతో పాటు తప్పనిసరి అయితే శస్త్రచికిత్సలు కూడా ఉచితంగా నిర్వహిస్తుండటాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారన్నారు. నాయకులు కూతురు నర్సింహ, కట్టా బలరామ్, రాజు, శ్రీలక్ష్మి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.