సిటీబ్యూరో, నవంబరు 8 (నమస్తే తెలంగాణ) : ప్లాస్టిక్‌ను నివారించి పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. ఓ పక ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని నిషేధిస్తూ.. మరోవైపు మహిళలకు ఉపాధి కల్పించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నది. ప్లాస్టిక్ కవర్లను నిషేధించి ప్రత్యామ్నాయాలపై స్వయం సహాయక సంఘాలకు శిక్షణనిచ్చి మారెట్లోకి ప్లాస్టిక్ రహిత సంచులను తీసుకువస్తున్నది. జీహెచ్ఎంసీలోని పట్టణ సామాజిక అభివృద్ధి (యూసీడీ) విభాగం నగరంలో స్వయం సహాయక బృందాలను ఈ దిశగా ప్రోత్సహిస్తున్నది.
20 నుంచి 30 మంది వరకు గ్రూప్‌గా కలిసివచ్చిన మహిళలకు రూ. 50వేల వరకు రుణాలు ఇప్పిస్తున్నారు. చేనేత వస్ర్తాలు, నార ఉత్పత్తులు, కాగితంతో చేతి సంచులు తయారు చేసి ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని నియంత్రిస్తున్నారు. ఇప్పటికే 1500 మందికి పైగా సంచుల తయారీలో యూసీడీ విభాగం భాగస్వామ్యం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇందులో కొందరు మహిళలు ప్లిప్‌కార్డు, అమెజాన్ వంటి ఈ -కామర్స్ సంస్థలకూ విక్రయిస్తున్నారు. శిక్షణ పొందిన మహిళలు జనపనార, కాగితం, వస్త్రం, దారాలు ఉపయోగించి రోజువారీగా వాడే సంచులు తయారు చేస్తున్నారు. సంచులు కుట్టడంతో పాటు రసాయనాలు లేని రంగులను వాటిపై అద్దడం వల్ల మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. కాగా, అందరికీ అందుబాటులో ఉండేలా తక్కువ ధరలకే విక్రయిస్తున్నామని మహిళలు తెలిపారు.