సిటీబ్యూరో, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో వరద నీటి నివారణకు సరికొత్త విధానాన్ని జీహెచ్ఎంసీ అమలు చేస్తున్నది. దాదాపు 140 చోట్ల వర్షపు నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించిన అధికారులు.. నీరు ఇంకిపోయేలా సంపుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 10 నుంచి 40 లక్షల లీటర్ల సామర్థ్యంతో 150 అడుగుల ఇంజక్షన్ బోర్‌వెల్స్ వేసి వరదను కట్టడి చేసేందుకు చర్యలకు ఉపక్రమించారు.
సుమారు రూ. 20 కోట్లతో ప్రయోగాత్మకంగా 12 చోట్ల భూగర్భ సంపుల నిర్మాణ పనులను చేపడుతున్నారు. ఇందులో భాగంగానే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ఎదుట 10 లక్షల లీటర్ల వర్షపు నీటి నిల్వ సామర్థ్యంతో సంపుల నిర్మాణ పనులను మొదలు పెట్టారు. సచివాలయం ఎదురుగా తెలుగు తల్లి వంతెన పక్కనున్న బస్టాపుల వద్ద భారీగా వర్షపు నీరు నిలుస్తోందని, అందుబాటులో ఉన్న స్థలాన్ని బట్టి విస్తీర్ణాన్ని నిర్ధారిస్తున్నామని ఇంజినీరింగ్ విభాగం అధికారులు పేర్కొన్నారు.
ఈ స్థలంలో నాలుగు ఇంజక్షన్ బోర్‌వెల్స్ వేశారు. ఒక్కొక్కటి 80 అడుగుల లోతుతో బోర్లు వేసినట్లు అధికారులు చెప్పారు. కాగా, నిర్ణీత స్థాయిలో వర్షపు నీరు వచ్చి చేరగానే సంపులో ఆటోమెటిక్‌గా మోటార్లు ఆన్ అయ్యేలా సెన్సార్లు ఏర్పాటు చేశారు. దీంతో వెంటనే వరద నీటి సమస్యకు పరిష్కారం లభించనుంది. ఈ తరహాలో 12 ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా సంపుల నిర్మాణాలు చేపడుతున్నారు. మిగిలిన చోట్ల టెండర్ దశలో ఉన్నాయని, త్వరలోనే అన్ని చోట్ల పనులు ప్రారంభించి ఈ వర్షాకాలం ముగింపు నాటికల్లా పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.