సిటీబ్యూరో: హైదరాబాద్ నగర సమగ్రాభివృద్ధికి, పౌరులకు సత్వర సేవలకు సంబంధించి కీలకమైన సమన్వయ సమావేశాలకు జీహెచ్ఎంసీ మంగళం పాడింది. అంతర్గతంగానూ, ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయ లేమితో జీహెచ్ఎంసీ వైఖరి నగర పౌరులను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నది. ఫుట్పాత్, జంక్షన్ల అభివృద్ధి, ట్రాఫిక్ సమస్య మొదలు నాలా, రహదారుల వెడల్పు, భూసేకరణ, అనుమతుల్లో జాప్యం, విద్యుత్, జలమండలికి సంబంధించి ఏ పనులు చేయాలన్నా ఏదో ఓ సమస్య ఏర్పడుతున్నది. వాస్తవంగా గతంలో సిటీ సమన్వయ కమిటీ తరచూ సమావేశాలు నిర్వహిస్తూ, అభివృద్ధి పనులు సకాలంలో పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు.
జలమండలి, పోలీస్, విద్యుత్, పీసీబీ, ఆర్టీసీ, వైద్యారోగ్యశాఖ, కలెక్టరేట్, అగ్నిమాపక శాఖ, హెచ్ఎండీఏ, తదితర శాఖల అధికారులు సభ్యులుగా ఉండగా, జీహెచ్ఎంసీ పెద్దన్న పాత్రను పోషించేది. ఈ సిటీ సమన్వయ కమిటీతో నగరంలో ప్రస్తుతం విస్తరించి కనిపిస్తున్న రహదారుల వెడల్పులో భాగంగా స్థల సేకరణకు సంబంధించి అనేక సమస్యలు పరిష్కారం చూసేవారు. దీర్ఘకాలిక ప్రజాసమస్యల పరిష్కారం, అభివృద్ధిలో ఇతర శాఖలను భాగస్వామ్యం చేస్తూ ప్రతి నెలలో రెండు సార్లు కన్వర్జెన్సీ సమావేశాలు నిర్వహించేవారు. ఒకానొక దశలో సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులతో కలిసి సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి.. తగిన సూచనలతో సమగ్రాభివృద్ధికి చర్యలు చేపట్టేవారు. కానీ గడిచిన కొన్ని నెలలుగా ప్రభుత్వ శాఖలతో జీహెచ్ఎంసీ సమన్వయం కుదరడం లేదు.
అధికారుల మధ్య సమన్వయం లేక..
అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో వేరే పనుల కోసం రోడ్లను తవ్వి అలాగే వదిలి వెళ్తున్నారు. కొన్ని చోట్ల అసలు అనుమతి లేకుండానే పనులు చేసుకుంటున్నారు. అదే సమన్వయ సమావేశాలు నిర్వహిస్తే అన్ని శాఖల అధికారులు ఉండటంతో అనుమతులు ఎవరిచ్చారో తెలుస్తుందని..దీని వల్ల పనులు పూర్తయ్యాక తిరిగి రోడ్లు వేసేలా చర్యలు తీసుకోవడానికి వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. వైట్ టాపింగ్ రోడ్లు, ఎస్ఆర్డీపీ తదితర పనులు ప్రారంభించే ముందుగానే ఆయా మార్గాల సమాచారాన్ని ఎలక్ట్రిసిటీ, జలమండలి, పోలీస్ తదితర శాఖలకు అందిస్తే పైపులైన్లను మార్చడం, అండర్ కేబుల్ నెట్వర్క్స్, సీసీ టీవీల ఏర్పాటు తదితర పనులను ముందే పూర్తి చేసే అవకాశం ఉంటుంది. అలా చేయకపోవడంతో రోడ్లు వేసిన కొద్ది రోజులకే ఏదో కారణంగా తవ్వేస్తున్నారు. దీని వల్ల ప్రజాధనం వృథా కావడంతో పాటు జనం ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.